
-ఆహారపు అలవాట్లు, వ్యాయామంతోనే నియంత్రణ సాధ్యం
-మధుమేహం బారిన దేశంలో 7.7 కోట్ల మంది
-ప్రభుత్వాలు మరిన్ని నియంత్రణ చర్యలు చేపట్టాలి
-ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మధుమేహ వ్యాధి నియంత్రణకు అత్యవసర సౌకర్యాలను తక్షణం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన పడి మరణించే వారి సంఖ్య రెట్టింపవుతుందని వీజీఆర్ డయాబెటిస్ స్పషాలిటీస్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి తెలిపారు. “నవంబరు 14న వరల్డ్ డయాబెటిస్ డే” సందర్భంగా మొగల్రాజపురంలోని వీజీఆర్ డయాబెటిస్ స్పషాలిటీస్ హాస్పిటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా 460 మిలియన్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారని, 2045నాటికి ఈ సంఖ్య 700 మిలియన్లకు చేరే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడిఎఫ్) గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో 3 వంతుల మంది పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దేశాల్లో ఉన్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధి బారిన పడ్డ మిలియన్ల మందికి సరైన చికిత్స, మందులు, పరీక్షలు ఏవీ కూడా అందుబాటులో లేవన్నారు. ప్రతి ఇద్దరిలో మధుమేహం ఉన్న ఒకరికి ఆ వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదన్నారు. భూమి మీద నివసించే ప్రతి 10 మందిలో ఒక వ్యక్తి మధుమేహ బాధితుడేనన్నారు. దాదాపుగా 50శాతం మదుమేహం కేసులను ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా నివారించవచ్చని తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో, ఐడీఎఫ్ సూచన మేరకు 2021-2023 సంవత్సరాలకుగాను “ప్రతిఒక్కరికీ మధుమేహ చికిత్స అందుబాటులోకి రావాలి” అనే నినాదంతో ఇకపై ముందుకు సాగుతామన్నారు. మధుమేహ వ్యాధికి సంబంధించి పెద్దవారిలో వచ్చే టైప్-2 బారిన నేడు 20-30 ఏళ్ల యువత ఉండటం ఆందోళన కల్గించే అంశమన్నారు. దీనిని సత్వరం నివారణ చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు, ఎన్జీవోస్ పైనా ఉందని, అలాగే ప్రజల్లో కూడా ఈ వ్యాధి పట్ల చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. భారత దేశంలో 2019నాటికి మధుమేహ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 77మిలియన్లు ఉండగా 2045కి ఈ సంఖ్య 13.4 కోట్లకు చేరవచ్చని గణాంకాలు చెబుతున్నాయన్నారు. మధుమేహ వ్యాధిని నియింత్రణకు డబ్ల్యూహెచ్‌వో, ఐడీఎఫ్ సూచించిన నినాదం అమలులో భాగంగా ఈ ఏడాది ప్రజాప్రతినిధులు, పాలనా అధికారులు, ప్రైవేట్ సెక్టార్‌లోని సీఈవోలు, విద్యారంగంలోని ప్రతినిధులకు వీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ రూపొందించిన 2వేల డయాబెటీస్ అట్లాస్ పుస్తకాలను ఉచితంగా అందించి అవగాహన కల్పించబోతున్నట్లు చెప్పారు. అదుపులో లేని మధుమేహ వ్యాధి బారిన పడడంతో పాటు తద్వారా వచ్చే దుష్పరిణామాల కారణంగా ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 67లక్షల మంది చనిపోగా అందులో నాలుగో వంతు మరణాలు భారతదేశంలో సంభవించాయని తెలిపారు. మందులు, టెక్నాలజీ, డయాబెటీస్ కేర్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ అందుబాటులోకి వస్తాయి అనే నినాదంతో ఆరోగ్య సంస్థలు అనేకం ముందుకు రావడం జరిగిందని పేర్కొన్నారు. మధుమేహ వ్యాధికి చికిత్స, నివారణ కోసం సరైన పాలసీలు రూపొందించి హెల్త్ బడ్జెట్‌ను పెంచాల్పిన అవసరం ఉందని ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో, ఐడీఎప్‌లు చెప్పడం జరిగిందన్నారు. మధుమేహ వ్యాధి ఉన్నవారిలో దాదాపుగా 50శాతం మందికి అవగాహన లేదన్నారు. అలాగే ఎడ్యుకేషన్ మెటీరియల్ కూడా అందుబాటులో లేదని తెలిపారు. మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ కనుక్కొని 100ఏళ్లు దాటుతున్నా ఎన్నో మిలియన్ల మందికి ఈ మందు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపారు. మందుబిళ్లలు కూడా చాలా దేశాల్లో ప్రజలకు అందుబాటు ధరల్లో లేవని తెలిపారు. చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని టైప్-1గా పిలుస్తారని, వీరు జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సి ఉంటుందన్నారు. ఈ వ్యాధి బారిన పడిన పిల్లల సంఖ్య మొత్తం మీద 1 నుంచి 2 శాతం మాత్రమే ఉంటారని తెలిపారు. గడచిన 20ఏళ్లుగా మధుమేహ వ్యాధి నియంత్రణ కోసం ప్రజలను చైతన్య పరిచేందుకు సామాజిక బాధ్యతగా తనవంతుగా ప్రసార మాధ్యమాలు, ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహణ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో కలిసి ఐదు వేల కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. మధుమేహ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ రూపొందించిన దాదాపు 7.50లక్షల పుస్తకాలను పాఠశాల, కళాశాల విద్యార్థులు, వ్యాధిగ్రస్తులు, ప్రజలకు వీజీఆర్ ట్రస్టు ద్వారా అందించామని తెలిపారు. అదేవిధంగా వీజీఆర్ ట్రస్టు ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం 40వేల మొక్కలను కడియం నుంచి తీసుకువచ్చి రైతులు, ప్రజలు, రోగులకు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా మధుమేహ వ్యాధి నియంత్రణ కోసం అవగాహన కల్పిస్తూ రూపొందించిన బ్రోచర్లను డాక్టర్ వేణుగోపాలరెడ్డి ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో డాక్టర్ వేణుగోపాలరెడ్డి, డాక్టర్ తనూజ, డాక్టర్ కార్తీక్, డాక్టర్ పూర్ణచంద్రరావు, డాక్టర్ రాజు, డాక్టర్ ప్రసాద్, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News