Breaking News

రానున్న మూడు రోజులు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది…

-జిల్లా యంత్రాంగం ,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
-భారీ వర్షాల దృష్ట్యా రైతులు వరి కోతలు కోయవద్దు…
-జిల్లా కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులను వరి కోతలు కోయవద్దని జిల్లా కలెక్టర్ జె.నివాస్ రైతులకు విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది నెమ్మదిగా నైరుతి దిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ డా. కె.మాధవీలత తో కలసి సబ్ కలెక్టర్,ఆర్టీఓలు, తహసీల్దార్లు, ఎంపిడిఓలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య తీరం దాటుతుందని వాతారణశాఖ హెచ్చరించడం జరిగిందన్నారు. ఈ దృష్ట్యా రానున్న మూడు రోజులు మరి ముఖ్యంగా ఈ నెల 18,19 తేదీలల్లో మచిలీపట్నం తో పాటు మరికొన్ని సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడం జరిగిందన్నారు. ఈ దృష్ట్యా జిల్లా అధికారులను, మండల అధికారులను, స్థానిక ప్రజలను అప్రముత్తం చేయాలని కలెక్టర్ కోరారు. నాగాయలంక, బంటుమిల్లి,మోపిదేవి. కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ మండలాల్లో రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన కోరారు. గ్రామాల్లో దండోరా వేయించమని, స్థానిక పత్రికలు, టీవీల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వమని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసే రిలీఫ్ క్యాంపులకు తరలించమని కలెక్టర్ కోరారు. ఇటీవల చెన్నై, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో వచ్చిన భారీ వర్షాలను కలెక్టర్ గుర్తు చేశారు. ఈ వర్షాల వల్ల కల్వర్టు వద్దనున్న కాలువ మూసుకుపోవడం వల్ల నీరు పారుదల ఇబ్బంది అయ్యిందని కలెక్టర్ చెప్పారు. ఆ నీటిలో పడి ఒక జంట ప్రాణాలు కూడా కోల్పోయిందని కలెక్టర్ గుర్తుచేశారు. అలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అలాగే జిల్లాలో ఖరీఫ్ వరి పంట కూడా కోతలు ప్రారంభమయ్యాయని అయితే భారీ వర్గాలు పడతాయన్న హెచ్చరికల దృష్ట్యా ప్రస్తుతం పంటను కోయవద్దని రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రస్తుతం పంట కోసి ఉంటే 17వ తేదీ లోపే సురక్షిత ప్రాంతంలో భద్రపరచుకోవాలని కోరారు. గంపలగూడెం,జి.కొండూరు, తిరుపూరు మండలాల రైతులను ప్రత్యేకంగా కోరాలన్నారు. ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాల్సివస్తే ఈ-క్రాప్ బుకింగ్ తప్పనిసరి కావాలని కలెక్టర్ చెప్పారు. అందువల్ల ఈ-పంట నమోదు చేసుకోని రైతులందరూ వెంటనే ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలన్నారు.

జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత మాట్లాడుతూ ఈనెల 19వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా మచిలీపట్నం, హంసల దీని ప్రాంతాల్లో ఎక్కువ మంది భక్తులు సముద్ర స్నానానికి వెళతారన్నారు. తుపాను హెచ్చరికల దృష్టిలో ఉంచుకుని సముద్ర స్నానాలకు వెళ్లకుండా దండోరా వేసి హెచ్చరించమని కోరారు. బందరు డివిజన్ లో ఉన్న 84 గ్రామాలు తుఫానుకు దెబ్బతినే గ్రామాలుగా ముందుగానే గుర్తించారని ఆ గ్రామాల్లో వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు, వాలంటీర్లు అప్రమత్తం చేయమని కోరారు.

ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జెడి టి.మోహన్ రావు, పశుసంవర్థ క శాఖ జెడి విద్యాసాగర్ ,సబ్ కలెక్టర్ జీఎస్ఎస్ ప్రవీణ్ చంద్, మచిలీపట్నం, నూజివీడు ఆర్డీఓలు ఖాజావలి, కె.రాజ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రజలకు భరోసాగా నిలవాలి

-పరిష్కరించిన ఫిర్యాదు తిరిగి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి -సత్వర, నాణ్యమైన పరిష్కారమే ప్రజల సంతృప్తికి కొలమానం -ఫిర్యాదుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *