అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భక్త కనకదాస జయంతి సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వారి చాంబరులో ఆయన భక్త కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ భారతీయ తత్త్వవేత్త సంగీతకారుడు, కవి కనకదాసు జయంతి నేడని,కనకదాస వారు 1509-1609 కర్నాటకలో గొప్ప భక్తుడుగా వెలుగొందారని పేర్కొన్నారు.ఆధునిక కవిగా,తత్వవేత్త,సంగీత కారుడుగా,స్వరకర్తగా కర్నాటక సంగీతం కోసం కర్నాటక భాషలో వ్రాసిన కీర్తనలు అధ్బుతాన్ని సమాజ చైతన్యాన్ని కలిగించిన విషయం తెలిసిందేనని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనకదాస వారి జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు.కనకదాస వారు రచించిన నవచరిత్ర,హరిభక్తచార,నృసింహ స్థభ, రామదాసు చరిత్ర వర్గ పోరాటాలపై అరుదైన రచనగా చెప్పవచ్చని అదేవిధంగా మోహన తరంగిని ఇత్యాది కవి కవిత్వాలను మనకు అందించిన కనకదాస అంటే ఆనాడు అన్నమయ్య ఏవిధింగా ప్రాచుర్యం పొందారో అలాగే కర్నాకట ప్రాంతంలో కనకదాస ప్రాచుర్యం పొందిన మహాభక్తుడని పేర్కొన్నారు.శ్రీకృష్ణ భక్తునిగా వారు మనందరికీ ఆదర్శమని ఆదర్శమే కాదు భక్తితో ఆరాధించాల్సిన వ్యక్తి కనకదాసని చెప్పారు.ఆయన జన్మదినాన్నిఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున బలహీన వర్గాల సంక్షేమ మంత్రిగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఇది మాబాధ్యత అని పేర్కొన్నారు.వీరియొక్క జీవిత చరిత్రను పరిశీలిస్తే భవిష్యత్తులో మన జీవనాన్ని ఎలా సాగించవచ్చో ఇలాంటి మహానుభావులు ఇచ్చిన సందేశాలు మనందరికీ కూడా మార్గదర్శకాలని మనకు ఏవిధంగా చరిత్ర చెబుతుందో ఆచరిత్రను కొనసాగించే పరంపరలో భాగంగా కనకదాసు వారి జయంతిని నిర్వహించడం జరిగిందని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర బిసి సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News