పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ ఫలాలు నిరుపేదల గుమ్మంవద్దకు చేరాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దిశగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అన్నారు. పెడన మండలం కొంకేపూడి గ్రామ సచివాలయాన్ని సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన అందించాలన్న ఉద్దేశ్యంతో గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. సమస్యలతో సచివాలయానికి వచ్చే వారిని గౌరవరంతో పలకరించి, వారి సమస్యను తెలుసుకుని, వాటిని నిర్దేశిత సమయంలోగానే పరిష్కరించినప్పుడే ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని, ఆ దిశగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఏ ఏ పధకాలు అమలు చేస్తుందీ , వాటిని పొందేందుకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే అవగాహనను ప్రజలలో కల్పించాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. వాలంటీర్లు వారి పరిధిలోని పేదలను గుర్తించి, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను వారి ఇంటికే వెళ్లి తెలియజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుతం పేదరికమే అర్హతగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. ప్రజల నుండి అందిన అర్జీలను ఆన్లైన్ లో నమోదు చేసి, పరిష్కార విధానాన్ని తప్పనిసరిగా ధరఖాస్తుదారుకి తెలియజేయాలన్నారు. దరఖాస్తును తిరస్కరించినట్లైతే అందుకు తగిన కారణాన్ని తప్పనిసరిగా ధరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. సచివాలయ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న లబ్ధిదారుల వివరాలను పధకాల వారీగా నోటీసు బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో రికార్డులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ వెంట తహసీల్దార్ మధుసూధనరావు , రెవిన్యూ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News