-అన్ని సి.హెచ్. సి.లలో బ్లడ్ స్టోరేజీ పాయింట్లు,
-గర్భీణీల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత సంబంధిత ఏ .ఎన్..ఎం. లు, అంగన్వాడీలు, వైద్య సిబ్బందిదే:
-నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోతే సంబంధిత వైద్యాధికారులు, సిబ్బందిపై చర్యలు:
– వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారికి ఆ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోతే సంబంధిత వైద్యాధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. జిల్లాలో వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్థానిక రైతు శిక్షణా కేంద్రంలో మంగళవారం వైద్యసేవలు అభివృద్ధి, మాతా ,శిశు మరణాల నివారణపై ప్రతీ అంశంపై వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ తలసరి ఆదాయంలో అగ్ర స్థానంలో ఉన్న కృష్ణా జిల్లాలో మాతా ,శిశు మరణాలలో ఆఫ్రికా దేశాల సగటు రేటుకు చేరడం బాధాకరమన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పోష్టికాహారం అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందిస్తున్నప్పటికీ కృష్ణా జిల్లాలో ప్రస్తుత సంవత్సరం ఇంకా పోష్టికాహార లోపం, రక్తహీనత వంటి కారణాలతో ప్రసవ సమయంలో 55 మాతా ,శిశు మరణాలు సంభవించడం అత్యంత శోచనీయమన్నారు. జిల్లాలో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేలా పనిచేయాలన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీ పరిధిలోని ఏ .ఎన్..ఎం. లు, అంగన్వాడీ సిబ్బంది వారి పరిధిలోని గర్భీణీలను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, వారికి ఏమైనా అనారోగ్య సూచనలు కనిపించినట్లైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలకు తీసుకువెళ్లాలన్నారు. వైద్య పరీక్షలు చేయించాలన్నారు. పోష్టికాహార లోపం, రక్త హీనత వంటి సమస్యలు లేకుండా చూడాలని, ఇమ్మునైజేషన్ చార్ట్ ననుసరించి ఎప్పటికప్పుడు టీకాలు వేయిస్తూ ఉండాలన్నారు. అంగన్వాడీ పరిధిలోని గర్భీణీల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత సంబంధిత ఏ .ఎన్..ఎం. లు, అంగన్వాడీ సిబ్బందిదేనన్నారు. జిల్లాలోని సి.హెచ్.సి. లు అన్నింటిని బ్లడ్ స్టోరేజ్ పాయింట్లు గా రూపొందించడం జరిగిందని, 13 సి.హెచ్.సి. లకు గాను 7 సి.హెచ్.సి. లు పూర్తి స్థాయి బ్లడ్ స్టోరేజ్ పాయింట్లుగా ఉన్నాయన్నారు. , చల్లపల్లి, విస్సన్నపేట, మైలవరం, ఉయ్యురు, గన్నవరం, మరియు మరో సి.హెచ్.సి.లలో అతి చిన్న కారణాల వలన ఇంకా బ్లడ్ స్టోరేజ్ పాయింట్ గా నడవడం లేదన్నారు. వాటిని నెలరోజులలోగా బ్లడ్ స్టోరేజ్ పాయింట్లు గా ఏర్పాటుచేయాలన్నారు.
బాపులపాడు గ్రామానికి చెందిన గర్భీణీ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి , ప్రసవానంతరం సదరు మహిళకు రక్తపోటు లో హెచ్చుతగ్గులు రావడంతో, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసారన్నారు. విజయవాడ ఆసుపత్రికి తీసుకువచ్చి జాయిన్ చేసే సమయంలో ఆ మహిళా మరణించడం శోచనీయమన్నారు. వైద్య చికిత్స, ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే వారికి సరైన వైద్యం అందించకుండా అత్యవసర పరిస్థితి పేరుతో విజయవాడ, మచిలీపట్టణం వంటి సుదూర ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వారు ఆయా ఆసుపత్రులు చేరుకునేందుకు 2 నుండి 3 గంటలు సమయం పడుతున్నాదని, ఆ సమయంలో సరైన వైద్య చికిత్స అందకపోవడంతో వారు మృత్యు వాత పడుతున్నారన్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రయత్నించకుండా పెద్దాసుపత్రికి రిఫర్ చేయడంతో ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయన్నారు. . జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చిన వారికి డాక్టర్లు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించవలసిందేనన్నారు. ఈ విషయంలో అలసత్వం వహించే వైద్యాధికారి, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటానన్నారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి ) ఎల్. శివశంకర్, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ సూర్య ప్రకాష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. సుహాసిని, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డా. జ్యోతిర్మణి , డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ. డా. జె. ఉషారాణి, వైద్యాధికారులు డా. నరేంద్రకృష్ణ, ఏ .ఎన్..ఎం. లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News