విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ స్పూర్తితో ప్రభుత్వాలు పాలన సాగిస్తేదాని ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని ఎస్. కమిషన్ చైర్మన్ ఏం. విక్టర్ ప్రసాద్ అన్నారు.
విజయవాడ ఆర్ టి సి కాంప్లెక్స్ లోని నాల్గవ ఫ్లోర్ నందు గల ఎస్.సి. కమిషన్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి విక్టర్ ప్రసాద్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని వారి ఆశయాలను అమలు పరచాలని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశమంతా ఘనంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. భారత రాజ్యాంగ విశిష్టతను పరిశీలిస్తే ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా అద్భుతమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రూపొందించారన్నారు.. మన పొరుగు దేశాలగు శ్రీలంక, పాక్షిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాలలో సైనిక పాలన, అంతర్గత విభేదాలతో పాలన సాగుతోందని, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాగం వలన భారత దేశం ప్రజా స్వామ్య దేశంగా విరాజిల్లుతున్నదని అయన అన్నారు.రాష్ట్రం లోని అన్ని గ్రామాలలోను, పట్టణాలలోనూ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతిని ఐక్య రాజ్య సమితి ఇంటర్నేషనల్ నాలెడ్జి డే గా అమలు చేస్తున్నదని అయన తెలిపారు. ప్రపంచంలో కొన్ని దేశాలు, యూనివర్సిటీలలో అంబేద్కర్ జీవిత విశేషాలతో పాటుగా వారి ఆశయాలనుపాఠ్య అంశాలుగా చేర్చారని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలనికోరిన వ్యక్తి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అని అన్నారు. దేశంలో భాక్రానంగల్ ప్రాజెక్ట్ తో పాటు లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్లానింగ్ సిస్టం ఏర్పాటుకు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఆలోచనలు ఎప్పుడూ నాదేశం, నా ప్రజలు గురించే ఉండేవని వారి మాటలలో చెప్పాలంటే దేశానికి, నాకు సంఘర్షణ జరిగితే దేశం వైపే ఉంటానని, జాతికి, నాకు సంఘర్షణ జరిగితే జాతి వైపే నిలబడతానని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అంటూ ఉండేవారని చెప్పారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ దేశంలో బడుగు, బలహీన వర్గాల వారికే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆయనే స్ఫూర్తి అన్నారు. రాష్ట్రంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్య క్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు. హక్కుల కోసం ఎస్.సి., ఎస్.టి. లు పోరాడే పరిస్థితులు ఉత్పన్నం కాకూడదనిరాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని విక్టర్ ప్రసాద్ అన్నారు.
ఎస్.సి. కమిషన్ సభ్యులు చెల్లంఆనంద్ ప్రకాష్ మాట్లాడుతూ అనేక ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేయుట వలన ఇంకను పేదలు పేదలు గానే ఉండిపోయారన్నారు. ప్రపంచంలోనే ఆదర్శ వంతమైన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావిగా కొనియాడబడ్డారన్నారు. ప్రపంచంలో 60 దేశాల్లోని రాజ్యాంగాలను పరిశీలించి అన్ని వర్గాల ప్రజలకు అనువైన భారత రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు.
ఎస్. సి. కమిషన్ సభ్యులు కే. బసవ రావు మాట్లాడుతూ రాజ్యాంగం ఆమోదించి 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించు కుంటున్నామన్నారు. రాజ్యాంగ స్పూర్తితో ప్రభుత్వాలు పాలన సాగించినప్పుడు దాని ఫలాలు ప్రజలందరికి అందుతాయని బసవయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News