-వివిధ పథకాల కింద తక్షణ రుణ సదుపాయం.. .
-కిసాన్ తత్కాల్ పథకం కింద రూ.50 వేల వరకూ పంట రుణం..
-ఫెస్టివల్ బోనాంజా కింద డిసెంబర్ 31 వరకూ ఎంఎస్ఎంఈలకు అతి తక్కువ వడ్డీకే రుణాలు..
-అతి తక్కువ వడ్డీ 6.40 శాతానికే హౌసింగ్ లోన్..
-పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకూ రుణం..
-వివరాలను వెల్లడించిన చీఫ్ జనరల్ మేనేజర్ వి. బ్రహ్మనందరెడ్డి.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కాలంలో సంభవించిన తుఫాను, వరదలతో నష్టపోయిన రైతులను, ప్రజలను.. కరోనా కారణంగా దెబ్బతిన్న చిన్న చిన్న వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవడానికి, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5 వేల కోట్లతో భారీ రుణప్రణాళిక అమలు చేస్తున్నదని చీఫ్ జనరల్ మేనేజర్ వి. బ్రహ్మానందరెడ్డి తెలిపారు. విజయవాడలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో మంగళవారం నాడు జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో బ్యాంకు తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. కిసాన్ తత్కాల్ పథకం కింద రూ.1,000 కోట్లు, స్వయం సహాయక పొదుపు సంఘాలకు రూ.1,500 కోట్లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు రూ.2,000 కోట్లు అదనంగా తక్షణ రుణాన్ని కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధంచేసినట్లు తెలిపారు. విజయవాడ రీజియన్ లో హౌసింగు లోను కింద తక్షణ రుణం పొందడానికి 15,800 మంది అర్హుల జాబితాను గుర్తించామని.. హోం లోన్స్ క్రమం తప్పకుండా చెల్లించే వారికి ఎటువంటి తనఖా లేకుండా మరో 15 లక్షలు వరకూ రుణం అందిస్తామని ఆయన తెలిపారు.
కోవిడ్ ఆర్థికమాంద్యం, ఈ మధ్య కాలంలో సంభవించిన తుఫాన్, వరదలు కారణంగా దెబ్బతిన్న కడప, అనతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు మరియు ఇతర ప్రాంతాల రైతులు, మహిళలు, ఇతరవర్గాల ప్రజలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వారి ఆర్థిక పురోగతికి, వ్యవసాయ, వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు వీలుగా తక్షణ బుణ సదుపాయం కల్పిస్తున్నట్లు బ్రహ్మనంద రెడ్డి తెలిపారు. రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు మరియు ఇతర ప్రజలకు ప్రయోజనకరంగా పథకాలను బ్యాంకు అమలు చేస్తుందన్నారు. రైతులకు కిసాన్ తత్కాల్ పథకం కింద వారి పంట రుణంలో 50% లేదా రూ.50,000 వరకు తక్షణ రుణాన్ని ఎలాంటి అదనపు పూచీకత్తు లేకుండా అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక బృందం సభ్యులు గరిష్టంగా రూ.20 లక్షల వరకు, పట్టణాల్లో గరిష్టంగా రూ.10 లక్షల వరకూ రుణాన్ని పొందవచ్చనని తెలిపారు. కోవిడ్ కారణంగా నష్టపోయిన సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ వర్గాలకు 30% నుంచి 40% వరకూ తక్షణ రుణం కోవిడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ పథకం కింద పొందవచ్చని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ‘ఫెస్టివల్ బొనాంజా’..
కొత్త MSME యూనిట్లకు ఫెస్టివల్ బొనాంజా పథకం కింద అతి తక్కువ వడ్డీ, రాయితీలతో రుణాన్ని పొందవచ్చనన్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకూ మాత్రమే తక్కువ వడ్డీ అమలవుతుందన్నారు. గతంలో కంటే ప్రస్తుతం వడ్డీ రేటు తక్కువగా ఉండడంతో అదనపు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న హోమ్ లోన్ ఖాతాదారులు అదనంగా మరో 15 లక్షల రూపాయల వరకు ఎలాంటి అదనపు పూచికత్తు లేకుండా రుణం పొందవచ్చనని తెలిపారు. ఏ బ్యాంకు ఇవ్వని విధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.40 శాతం వడ్డీకే గృహ రుణాలను మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రధాన్ మంత్రి జన సురక్ష పథకం కింద 18-21 వయస్సు గల వారందరికీ బ్యాంక్ అకౌంట్ల తెరిచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్ల జాబితాను పరిశీలించి ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ కలిగిఉండేలా సిబ్బంది క్షేత్రస్థాయిలో కృషిచేస్తున్నారన్నారు. అతి తక్కువ ప్రీమియంతో బ్యాంకు ఖాతాదారులందరినీ అనుసంధానిస్తూ 100 శాతం సంతృప్తస్థాయి దిశగా బ్యాంకు పనిచేస్తుందని బ్రహ్మనందరెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ హెడ్ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.శ్రీనివాసులు రెడ్డి, విజయవాడ రీజినల్ హెడ్ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ వేగే రమేష్, మచిలీపట్నం రీజినల్ హెడ్ & డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు తదితర అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News