-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు: మంత్రి కందుల దుర్గేష్
-ప్రజాసేవలో తనదైన అధ్యాయాన్ని లిఖిస్తున్న అసాధారణ వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ ది
పవన్ కళ్యాణ్ ఆలోచనలు మరెన్నో మార్పులకు నాంది పలకాలని, ఆయన ఆశయాలు మరెన్నో తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు ప్రజల గుండెల్లో ఒక ప్రభంజనంగా, కోట్లాది జనుల ఆశయాల్లో ఒక విప్లవంగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… “జీవితం అంటే కేవలం వ్యక్తిగత విజయాలకే పరిమితం కాదు; సమాజం కోసం ప్రశ్నించడం, ప్రజల కోసం నిలబడటం, ఆశయాల కోసం పోరాడటం కూడా జీవిత పరమార్థమేనని తన ప్రయాణంతో నిరూపించిన అసాధారణ వ్యక్తిత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ది . సినీ రంగంలో తనదైన ముద్ర వేసి కోట్లాది అభిమానుల ప్రేమను సంపాదించిన ఆయన, ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన ఆశయాలను వీడకుండా, నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పోరాడిన ధైర్యశాలి ఆయన” అని కొనియాడారు. తెరపై హీరోగా అలరించి, నిజ జీవితంలో ప్రజల కోసం నిలబడి, సమాజ మార్పు కోసం జనసేన పార్టీని స్థాపించి నేడు ప్రజాసేవలో తనదైన అధ్యాయాన్ని లిఖిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు మరెన్నో మార్పులకు నాంది పలకాలని, ఆయన ఆశయాలు మరెన్నో తరాలకు స్ఫూర్తిగా నిలవాలని, ప్రజల పట్ల ఆయన ప్రేమ, సేవా సంకల్పం చిరకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. “ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర రంగాలు వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుండడమే ఆయన సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనం. గతంలో అధమ స్థానంలో ఉన్న వ్యవస్థలను స్వల్ప కాలంలోనే ప్రథమ స్థానంలోకి తీసుకువచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షుతో ప్రజలకు మరిన్ని సేవలందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అన్నారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మంగళవారం ఒక ప్రకటనలో మంత్రి దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News