నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ పధకంలో పాల సేకరణను మరింత పెంచేందుకుగాను జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవీలత, ఎల్. శివశంకర్, ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి శనివారం నూజివీడు డివిజన్లోని మారుమూల పల్లెప్రాంతాలలో విస్తృతం పర్యటించి ప్రమోటర్లు, మహిళా పాడి రైతులతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా. కె. మాధవీలత రెడ్డిగూడెం మండలం ముచినపల్లి, రాఘవాపురం గ్రామాలలో ప్రమోటర్లు, మహిళా పాడి రైతులతో అవగాహనా కార్యక్రమం నిర్వహించి జగనన్న పాలవెల్లువ ప్రయోజనాలపై మహిళా పాడి రైతులకు అవగాహన కలిగించి పాల సేకరణ మరింత పెరిగేలా కృషిచేయాలని ఆదేశించారు. జగనన్న పాలవెల్లువ పథకం పాడి రైతుల పాలిట వరమని, జిల్లాలో జగనన్న పాలవెల్లువ పధకానికి పాడి రైతుల నుండి మంచి స్పందన లభిస్తున్నదన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో ప్రమోటర్లు, మహిళా పాడి రైతులతో అవగాహనా కార్యక్రమం నిర్వహించి జగనన్న పాలవెల్లువ ప్రయోజనాలపై మహిళా పాడి రైతులకు అవగాహన కలిగించారు. జగనన్న పాలవెల్లువ పాలసేకరణ కేంద్రంలో అమూల్ డైరీ వారు ప్రైవేట్ డైరీలకన్నా లీటరుకు 7 నుండి 10 రూపాయల వరకు అదనంగా అందిస్తున్నారని, నెలకు 3 నుండి 5 వేల రూపాయల వరకు అదనంగా ఆదాయం వస్తున్నదన్నారు. జగనన్న పాలవెల్లువ ప్రయోజనాలు మహిళా పాడి రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు.
నూజివీడు ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి ముసునూరు మండలం గోపవరం లో ప్రమోటర్లు, మహిళా పాడి రైతులతో అవగాహనా కార్యక్రమం నిర్వహించి జగనన్న పాలవెల్లువ ప్రయోజనాలపై మహిళా పాడి రైతులకు అవగాహన కలిగించారు. జగనన్న పాలవెల్లువ పాల సేకరణ కేంద్రాలకు నిరంతరంగా పాలు అందించే పాడి రైతులకు పాడి పశువులు కొనుగోలుకు స్వల్ప,దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నామని, అంతేకాక అమూల్ సంస్థ ద్వారా మంచి పోషకాలతో కూడిన పశువుల దాణా, పాడి పశువులకు వైద్య సౌకర్యం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఓలు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, వెలుగు సిబ్బంది, ప్రమోటర్లు, రైతు భరోసా కేంద్రం సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News