విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాల విభజనలో భాగంగా మార్చి మూడో తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు సూచనలను స్వీకరించడం జరుగుతుందని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి జిఎస్ఆర్ కెఆర్ విజయ్ కుమార్ అన్నారు.
నగరంలోని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యాలయంలో బుధవారం ప్రకాశం గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు సూచనలను సంబంధిత జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి జిఎస్ఆర్ కె ఆర్ విజయకుమార్ సమీక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల విభజనలో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ముప్పై రోజుల వరకు గడువు ఇవ్వడం జరిగిందని, ఆయా జిల్లాల కలెక్టర్లు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నారన్నారు. మార్చి మూడో తేదీ వరకు వీటిని స్వీకరిస్తారని ఆయన అన్నారు. మార్చి 3 వరకూ అభ్యంతరాలను కలెక్టర్లకు ఇవ్వవచ్చునన్నారు. మార్చి మూడు తర్వాత అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిశీలిస్తామని, మార్చి 10 లోపు సంబంధిత జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్నారు. ఏప్రిల్ రెండో తేదీ నుండి కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందన్నారు. విభజన అనేది భౌగోళిక, జనాభా, సామాజిక, చారిత్రక,సాంస్కృతిక అంశాలను పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉద్యోగులకు సంబంధించి మౌలిక వసతులు ఏర్పాటు, విభజన, కేటాయింపులు తదితర అంశాలపై చర్చిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ గ్రామాలు, మండలాలకు సంబంధించి అభ్యంతరాలు చాలా తక్కువగా వచ్చాయన్నారు. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ఇబ్బంది ఏమీ లేదని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి జిఎస్ఆర్ కె ఆర్ విజయకుమార్ అన్నారు.
జిల్లాల వారీగా ఇప్పటివరకు వచ్చిన వినతులను పరిశీలించడం జరిగిందని అన్నారు. అభ్యంతరాలు,సలహాలు, సూచనలను పరిశీలిస్తే.. ముఖ్యంగా మార్కాపూర్ ను ప్రత్యేక జిల్లాగా చేయాలని, కందుకూరు రెవిన్యూ డివిజన్ ను ప్రకాశంలో ఉంచాలని ఉన్నాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమలను ఏలూరులో ఉంచాలని కోరడం జరిగిందని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు.
Prajavartha Online Telugu News