-వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా పటిష్ఠ చర్యలు
-దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.
-రూ. 2 కోట్ల 15వ ఆర్ధిక నిధులతో కొండ ప్రాంత వాసులకు త్రాగునీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన
-మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోవు వేసవికాలంలో నగరంలో తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 51, 48, 45,44 మరియు 38వ డివిజన్ల పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాల మంచినీటి సరఫరా పైప్ లైన్ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజరెడ్డితో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ ద్వారా సరఫరా చేయు రక్షిత త్రాగునీటి సరఫరా విధానములో ఎదురౌతున్న సమస్యల పరిష్కారానికై రూ. 2 కోట్ల 15వ ఆర్ధిక సంఘ నిధులతో త్రాగునీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసుకున్నట్లు వివరించారు. పనులు వెంటనే ప్రారంభించి సత్వరమే పూర్తిచేయవలసినదిగా చూడాలని సంబందిత అధికారులు మరియు కాంట్రాక్టర్లను ఆదేశించారు. నీటి సరఫరా విషయంలో కిందిస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి ఏవిధమైన ఇబ్బందులు కలిగిన వాటిని యుద్దప్రాతిపదికన పరిష్కరించి నీటి సరఫరాలో అంతరాయం కలుగుకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రెయిన్లు మొదలగు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించి సమస్యల పరిష్కారం కొరకు నగరపాలక సంస్థ అనేక కోట్ల అంచనాలతో శంకుస్థాపనలు చేసి వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని అన్నారు. అదే విధంగా నేడు 51వ డివిజన్ నందు రూ.35 లక్షలు, 48వ డివిజన్ నందు రూ.50 లక్షలు, 45వ డివిజన్ నందు రూ.45 లక్షలు, 44వ డివిజన్ నందు రూ.35 లక్షలు మరియు 38వ డివిజన్ అందు రూ.35 లక్షలు మొత్తం 2 కోట్ల 15వ ఆర్ధిక సంఘ నిధులతో కొండ ప్రాంత ప్రజలు త్రాగునీట సరఫరాను మెరుగుపరచుటకు పాత జి.ఐ పైపుల స్థానములో కొత్త పైపులైన్ వేయు పనులకు మంత్రి వర్యులుచే శంకుస్థాపన చేయుట జరిగిందని వివరించారు. గతంలో ఎప్పుడో వేసిన పైపుల వల్ల కొండ ప్రాంతాలలో సక్రమముగా త్రాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యలను స్థానిక కార్పొరేటర్ల తెలిపిన దర్మిలా మంచినీటి సరఫరా విధానములో కలుగుతున్న ఇబ్బందులను దృష్ట్యా వచ్చే వేసవి కాలంలో కొండ ప్రాంతాలలో త్రాగునీటి ఇబ్బంది కలుగకూడదు అనే లక్ష్యంగా పైపు లైన్ మార్పు పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆమె పేర్కొన్నారు, మంత్రి గారి చొరవతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం లభిస్తోందన్నారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్, అత్తలూరి ఆదిలక్ష్మి, మైలవరపు మాధురీ లావణ్య, మైలవరపు రత్నకుమారి, షేక్ రహమతున్నీసా లతో పాటుగా పలువురు వై.ఎస్.ఆర్.సి.పి కార్పొరేటర్లు మరియు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.