Breaking News

జాతీయ చేనేత ప్రదర్శన వేదికగా కేక పుట్టించిన ర్యాంప్ వాక్…

-విజయవాడ లో ఘనంగా చేనేత ఫ్యాషన్ షో
-నగర వాసుల నుండి మునుపెన్నడూ చూడని ఆదరణ: చిల్లపల్లి
-భారీ రాయితీ ధరలకు చేనేత వస్త్రాలు : చదలవాడ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ చేనేత ప్రదర్శన వేదికగా విజయవాడలో నిర్వహించిన హ్యాండ్లూమ్స్ ఫ్యాషన్ షో ఆహాతులను ఆకర్షించింది. విభిన్న రాష్ట్రాలకు చెందిన నూతన చేనేత వస్త్ర శ్రేణితో పడతులు చేసిన ర్యాంప్ వాక్ అదరహా అనిపించింది. చేనేత సంస్కృతి సంప్రదాయాలతో విజయవాడ ఎ ప్లస్ కన్వేన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్న జాతీయ చేనేత ఎక్స్ పో ఇప్పటికే నగర వాసుల ఆదరణను చూరగొంటుండగా, ఆదివారం అక్కడ చేనేత జౌళి శాఖ ఫ్యాషన్ షో నిర్వహించింది. సరికొత్త డిజైన్లతో రూపొందించిన సాంప్రదాయ చేనేత వస్త్రాలతో ప్రదర్శన నిర్వహించిన ముద్దుగుమ్మలు ఆహా అనిపించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చీరాల ,ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఇలా ఒకటా రెండా వందలాది డిజైన్లతో ప్రత్యేకించి యువతను ఆకర్షించే విధంగా రూపుదిద్దిన చేనేత వస్త్రాల ప్యాషన్ షో కేక పుట్టించింది. దేశంలోని 19 రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ఫ్యాషన్ షో ద్వారా ప్రదర్శింప చేసారు. చేనేత వస్త్రాలను నేటి యువతీయువకులు చేరువ చేసే క్రమంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మోడల్స్ తో పాటు చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడే యువతులు సైతం స్వచ్ఛంధంగా ర్యాంప్ వాక్ లో పాల్గొనటం విశేషం. చేనేత వస్త్రాలంటే వయోజనులకే అన్న నానుడికి ముగింపు పలుకుతూ ర్యాంప్ వాక్ సాగింది. చేనేత ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన డిజైన్ల వస్త్ర శ్రేణి ఫలితంగా యువతుల అందం రెట్టింపు అయ్యిందంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ ఈ ప్రదర్శన నగర వాసుల నుండి మునుపెన్నడూ చూడని ఆదరణను చూరగొంటుందన్నారు. చేనేత వస్త్రాలు అందంతో పాటు హుందాతనాన్ని ఇస్తాయని, ఆరోగ్యపరంగాను, పర్యావరణపరంగాను ఎంతో అనుకూలమైనవన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగం పట్ల ప్రత్యేక దృష్టి సారించి వారి ఆర్థికాభివృద్ధి కోసం, ఎల్లా వేళల పని కల్పించే లక్ష్యముగా సొంత మగ్గము ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికునికి నేతన్న నేస్తం పధకం ద్వారా ఏటా రూ.24వేలు అందిస్తున్నారన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన చేనేత జౌళి శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి మాట్లాడూతూ ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ప్రత్యేక శ్రద్దతో చేనేత కళను ప్రోత్సహిస్తూ ఈ రంగాన్ని స్వయం సమృద్ది బాటలో నడిపించటానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర చేనేత వస్ర్త శ్రేణికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా కాలానుగుణ ఫ్యాషన్లకు అనుగుణంగా నూతన వెరైటీలను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని రకాల చేనేత వస్త్రాలు ప్రస్తుత ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని, నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ లో ప్రత్యేక రాయితీలు అమలవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్, సంయిక్త సంచాలకులు కన్నబాబు, నాగేశ్వరావు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *