సమర్థ ఆచరణే .. మనల్ని కోరుకొన్న గమ్యస్థానాలకు చేరుస్తుంది… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని పటిష్ట ప్రణాళికను రూపొందించుకుని పట్టుదలతో  శ్రమిస్తే ఆ సమర్థ ఆచరణే మనల్ని కోరుకొన్నగమ్యస్థానాలకు తప్పక చేరుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) గెలుపు సూత్రం బోధించారు.

సోమవారం ఉదయం ఆయన శాసనసభ సమావేశాలకు ఉదయం 7:30 గంటల సమయంలో  తాడేపల్లి ప్రయాణమవుతూ  తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో  జియో జూమ్ దృశ్య మాధ్యమం ద్వారా  బిగ్ స్క్రీన్ పై మాట్లాడుతూ ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

తొలుత మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి  గ్రామానికి చెందిన అనిశెట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ, తన కుమారుడు రామ్ చరణ్ కు  బోన్ క్యాన్సర్ సోకడంతో ఎడమకాలు మోకాలి వరుకు శస్త్ర చికిత్స చేసి తొలగించారని ప్రస్తుతం కీమో థెరపీ జరుగుతుందని వికలాంగ పింఛన్ కోసం గత ఏడాది దరఖాస్తు చేశానని ఇప్పటివరకు  మంజూరు కాలేదని చెప్పారు. ఈ విషయమై స్పందించిన మంత్రి తన వ్యక్తిగత కార్యదర్శి తేజాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆ బాలునికి సంబంధించిన వివరాలు మొత్తం తీసుకోని పింఛన్ ఇంకా ఎందుకు మంజూరు కాలేదో మచిలీపట్నం ఎం పి డి ఓ వద్దకు స్వయంగా వెళ్లి తెలుసుకోవాలని,  అప్పటివరకు మన కార్యాలయం నుండి ఆ బాబుకు పింఛన్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఆ బాబుకు కీమో థెరపీ పూర్తయిన తర్వాత కృత్రిమ కాలు అమర్చే బాధ్యత సైతం మనదేనని తెలిపారు.  అనంతరం వీడియో కాల్ ద్వారా రామ్ చరణ్ తో  కొద్దిసేపు మాట్లాడారు. నీ పేరు చాలా బాగుంది బాబు ..నీవేమి చదువుకొంటున్నావు ? ఎలా చదువుకొంటున్నావు ? పెద్దయ్యాక ఏమి చదవాలనుకొంటున్నావు ? అని ఆప్యాయంగా ప్రశ్నించారు.తాను  8 వ తరగతి చదువుతున్నానని, తనకు డాక్టర్ కావాలని ఉందని చెప్పాడు. గుడ్ ..గుడ్ …గుడ్  అని మంత్రి పేర్ని నాని ఆ బాలుడిని ప్రశంసించారు. స్కూల్ కు ఎలా వెళుతున్నావని ప్రశ్నించారు. తన తల్లి స్కూల్ బాగ్ మోస్తుంటే,  వాకర్ సహాయంతో రోజూ తాను బడికి తీసుకెళుతుందని జవాబు ఇచ్చాడు. నీకు ఉన్న విల్ పవర్ గొప్పది బాబు. ఆ గొప్ప లక్షణం జీవితాంతం తప్పకుండా  కొనసాగించాలని…  ఏ ఒక్కరి పైనా ఆధారపడకుండా స్వయంకృషితో కష్టించి  ఉన్నత స్థాయికి నీవు ఎదగాలని మనసారా దీవిస్తున్నానని అన్నారు, నీవు మంచి డాక్టర్ కావాలని, అప్పుడు నేను ముసలాడిని అయిపోతాను కదా..నాకు నీవు వైద్యం చేయాలి…నాకు ఆరోగ్యం బాగోకపోతే నీవద్దకే వస్తా మరి.. అని అంటూ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని పటిష్ట ప్రణాళికను రూపొందించుకుని శ్రమిస్తే సమర్థ ఆచరణే మనల్ని కోరుకొన్న గమ్యస్థానాలకు చేరుస్తుంది.. ఈ సూత్రం అస్సలు మర్చిపోవద్దు డాక్టర్ రామ్ చరణ్  ఆల్ ది బెస్ట్ అని మంత్రి పేర్ని నాని అన్నారు.

స్థానిక రాడార్ కేంద్రం సమీపంలో నివసించే పల్లె దుర్గ మంత్రికి తన కస్టాలు చెప్పుకొంది. తన ఆర్ధిక పరిస్థి బాగోలేదని ప్రస్తుతం నిర్మితమవుతున్న వైస్సార్ వైద్య కళాశాల వద్ద చిన్న టీ  దుకాణం పెట్టుకొంటానని, అక్కడ పనిచేస్తున్న కార్మికులకు వాటిని అమ్ముకొని జీవిస్తానని కోరింది.

స్థానిక సర్కారు తోటకు చెందిన బిక్కవోలు నిర్మల జ్యోతి తొమ్మిదో తరగతి చదివిన తనకు ఇద్దరు పిల్లలని వారిని పోషించడం ఎంతో కష్టమైందని ఏదైనా ఉద్యోగం వచ్చేలా సహాయం చేయాలని అభ్యర్ధించింది.

విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన శ్రీలత అనే నర్స్ మంత్రితో తన సమస్య చెప్పింది.జనరల్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా  ఎనిమిదిన్నర ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నానని, తన భర్త యాక్సిడెంట్ లో చనిపోయారని, పాప లయోలా కళాశాలలో  ఏవియేషన్ కోర్స్ చదువుతుందని ఇప్పుడు కౌన్సిలింగ్ అషన్లు ఇచ్చారని వేరే ప్రాంతానికి బదిలీ కాకుండా తనను నిలుపుదల చేయాలని కోరింది.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *