Breaking News

జగనన్న విద్యాదీవెన – పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం  వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ…

మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం…
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. 10.82 లక్షల మంది విద్యార్ధులకు మంచి చేస్తూ… ఈ రోజు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి రూ.709 కోట్లను బటన్‌ నొక్కి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

నాకు సంతోషాన్నిచ్చే కార్యక్రమమిది…
చదువు అనేది ఒక ఆస్తి. పిల్లలకు మనం ఏం చేస్తే బాగుంటుందంటే… ఎవరూ కూడా దొంగలించలేని ఆస్తి ఏదైనా ఉందంటే ఒక్క చదువు మాత్రమే. చదువు అన్నది జీవితాలను మార్చివేస్తుంది. జీవన ప్రమాణాలను మార్చివేస్తుంది. ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలన్నా.. ఒక అడుగు ముందుకు వేయాలన్నా.. ఆ కుటుంబంలో నుంచి ఒక పిల్లవాడు కానీ, పాప కాని.. డాక్టరు, ఇంజనీరు లాంటి పెద్ద చదువులు చదివినప్పుడు, మెరుగైన జీతాలు సంపాదించే పరిస్థితి వచ్చినప్పుడే.. ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది. అన్నింటికన్నా నాకు చాలా సంతోషాన్నిచ్చే కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈ విద్యాదీవెన, వసతి దీవెనే.

నూరు శాతం అక్షరాస్యత ఉన్న సమాజాలు…
ఇవాళ 100 శాతం అక్షరాస్యత ఉన్న సమాజాలు ఎలా ఉంటాయో గమనించినట్లైతే.. ఆశ్చర్యం కలిగించే విషయాలు మనకు అర్ధమవుతాయి. నూరుశాతం అక్షరాస్యత ఉన్న సమాజంలో శిశుమరణాలు, జన్మ సమయంలో తల్లుల మరణాలు కూడా ఇక్కడే తక్కువగా ఉంటాయి. విద్య అనేది జీవితంలో నాణ్యతను, జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. చదువుకోని, విద్య ఉన్న కుటుంబాలను పోల్చితే.. ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఒక పిల్లవాడు ఒక ఊరు నుంచి డాక్టర్‌ అయితే ఆ కుటుంబం బాగుపడటమే కాకుండా ఆ గ్రామం కూడా బాగుపడుతుంది. వీటికి చాలా ఉదాహరణలు చెప్పవచ్చు. పెద్ద పెద్ద డాక్టర్లు చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చి, పై స్ధాయిలోకి వెళ్లిన తర్వాత ఈ రోజుకు కూడా ఆ గ్రామాలను వాళ్లు గుర్తు పెట్టుకుని… అక్కడ మంచి చేయడానికి తాపత్రయపడతారు. అమెరికా వంటి దేశాల్లో ఉన్నవాళ్లు, వాళ్ల గ్రామాలకు మేలు చేయడానికి అక్కడ నుంచి డబ్బులు కూడా పంపిస్తుంటారు. వాళ్ల జీవితాల్లో వెనక్కి వెళ్లి చూస్తే.. చదువు వల్లనే వాళ్లు ఆస్ధాయికి వెళ్లారు అని ఎవరికైనా అర్ధం అవుతుంది.

పేదరికం వల్ల చదువులు ఆగకూడదు…
ఇలాంటి పరిస్థితులు మారాలి, మన పిల్లలకు కూడా చదువులకి పేదరికం అడ్డురాకూడదు.. డబ్బులు లేకపోవడం వల్ల చదువులు ఆపే పరిస్థితి రానే రాకూడదనేది నేను గట్టిన నమ్మిన సిద్ధాంతం.

నా కళ్ల ముందు మెదిలే ఘటన…
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అనే అంశం మీద ఎప్పుడు మాట్లాడాల్సిన వచ్చినా కూడా… నా కళ్ల ముందు ఒక ఘటన కనిపిస్తుంది. నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక ఘటన.
ఆ కాలేజీలో ఫీజు దాదాపు రూ.1 లక్ష ఉంటే… ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా దాదాపు రూ.30 వేలు మాత్రమే వచ్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితులలో ఆ పిల్లాడు తండ్రి నా దగ్గరకు వచ్చి తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని నాకు చెప్పారు. మిగిలిన రూ.70 వేలు ఎక్కడ నుంచి తేగలుగుతాము, నా తల్లిదండ్రుల మీద భారం అవుతుందని బాధపడి ఆ పిల్లవాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఒక సంవత్సరం తన తండ్రి కిందామీదా పడి ఆ రూ.70వేలు తెచ్చి తన చదువులకు తోడుగా ఉన్నా కూడా.. మరలా రెండో సంవత్సరం సెలవులకి వచ్చేసరికి అదే పరిస్థితి మళ్లీ వచ్చి ఆ పిల్లాడు తన తండ్రి మీద ఆ భారాన్ని మోయించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఆ తండ్రి చెబుతున్నప్పుడు ఈ రోజుకీ కూడా నేను ఆ ఘటనను మర్చిపోలేను. ఆ పరిస్థితి ఏ ఒక్కరికీ కూడా రాకూడదు. నా చిట్టిచెల్లెల్లు, చిట్టి తమ్ముళ్లు గొప్పగా చదవాలి. చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రాకూడదు. చదువులు చదివితేనే మన పరిస్థితులు బాగుపడతాయి. మనం మెరుగైన పరిస్థితుల్లోకి పోతామని గట్టిగా ఇంతకు ముందు నాకన్నా గట్టిగా నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నాన్నగారు అనే చెప్పాలి.

నాన్న ఒక విప్లవం తీసుకొచ్చారు…
నాన్న హయాంలో ఒక విప్లవం తీసుకువచ్చి ప్రతి పేదవాడికి కూడా తోడుగా నిలబడే గొప్ప కార్యక్రమం చేశారు. ఇంతకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదల కోసం మేం ఎంతో చేశామని గతంలో నాయకులు మాటలు చెప్పేవాళ్లు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదల కోసం భాషణలు ఇచ్చే వాళ్లే తప్ప నిజంగా వారి జీవితాలు మార్చాలని తాపత్రయపడే వాళ్లెవరూ లేరు.
ఆ దిశగా అంతో ఇంతో నాన్న అడుగులు వేశారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌అన్నదాన్ని ఆ రోజుల్లో నాన్న (వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి) తీసుకువచ్చారు.

తర్వాత పాలకులు మొక్కుబడిగా…
నాన్న చనిపోయిన తర్వాత వచ్చిన పాలకులు మొన్నటి వరకూ… పాక్షికంగా ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు మొక్కుబడిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేశారు. స్కీంను మొత్తం నాశనం చేసే పరిస్థితుల్లోకి తీసుకుపోయిన తర్వాత ఈ రోజు మళ్లా పూర్తిగా మారుస్తున్నాం. మనం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా, అర్హులైన పేద విద్యార్ధులందరికీ కూడా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసన్‌ కోర్సుల చదివే విద్యార్ధులందరికీ కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అన్నది క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ఇవ్వడమే కాకుండా . ఎటువంటి ఎరియర్స్‌ లేకుండా, వసతి దీవెన అనే గొప్ప ఆలోచన చేశాం. ప్రతి త్రైమాసికానికి ఇవ్వడమే కాకుండా వసతి దీవెన అనే గొప్ప ఆలోచన చేసి బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ కోసం పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితులు రాకూడదని… మెడిసిన్, ఇంజనీరింగ్‌ చదివే పిల్లలకు రూ.20వేలు, పాలిటెక్నిక్‌ చదివే పిల్లలకు రూ.15వేలు, ఐటీఐ చదివే పిల్లలకు రూ.10వేలు సంవత్సరానికి రెండు దఫాలుగా వసతి దీనెన అని పేరుతో ఇచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది.

గత ప్రభుత్వం హయాంలో…
గత ప్రభుత్వంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌ పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి అలోచన చేసినట్లయితే… అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్లు. రూ.70 వేలు, రూ.లక్ష నుంచి ఫీజులు ఏ స్దాయిలో ఉన్నా కూడా రూ.30 వేలు ఆరకొరగా ఇచ్చే పరిస్థితులు. అది కూడా సమయానికి ఇచ్చే పరిస్థితి లేదు.

2017–18, 2018–19 ఈ సంవత్సరాలకు ఏకంగా రూ.1778 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో పెట్టి గత పాలకులు మాకు అప్పజెప్పి పోతే.. చిరునవ్వుతోనే ఆ పిల్లలకు ఏ ఒక్కరికీ ఇబ్బంది రాకూడదనే ఉద్దేశ్యంతో ఆ బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది.

మన ప్రభుత్వం చేసిన ఖర్చు…
జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన ఆని ఈ పథకాల కోసం… గత ప్రభుత్వం చేసిన బకాయిలతో కలుపుకుని మన ప్రభుత్వం రూ.9274 కోట్లు ఖర్చు చేసింది. ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా గొప్ప విప్లవాత్మకమైన మార్పును కూడా తీసుకురావడం జరిగింది. అదేమిటంటే ఈ డబ్బులు తొలిసారి తల్లుల ఖాతాల్లోకి ఇవ్వడం. తల్లులను ఈ ప్రక్రియలో భాగస్వామ్యులను చేశాం.
అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఇవాళ ఇస్తున్నాం. మరలా జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి, మరలా మే నెలలో చెల్లిస్తాం. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే ఆలస్యం లేకుండా… ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.

తల్లుల ఖాతాల్లో జమ చేయడం వలన…
దీనివల్ల జరిగే గొప్ప మంచి ఏమిటంటే.. తల్లులు వెళ్లి ఫీజులు కట్టడం మొదలు పెడితే కాలేజీలో జవాబుదారీతనం పెరుగుతుంది. తల్లులే ఫీజులు కడుతున్నారు కాబట్టి.. అక్కడ ల్యాబులు, వసతులు ఏవి బాగాలేకపోయినా ప్రశ్నించే హక్కు వారికుంటుంది. అలా ప్రశ్నించే హక్కు తల్లులకు ఇస్తూ.. కాలేజీల్లో కూడా మెరుగైన వసతులు తీసుకొచ్చే ప్రక్రియ మెరుగ్గా ఉండాలనే ఉద్దేశ్యంతో వారిని కూడా జవాబుదారీ చేస్తూ… తల్లుల ఖాతాల్లోకి ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

వసతి దీనెన అనే కార్యక్రమంలో కూడా మనం ప్రతి విద్యార్ధికి ఇస్తున్న రూ.20 వేలులో ఇప్పటికే రూ.10వేలు ఇచ్చాం. రెండో విడత ఏప్రిల్‌ 5న ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా ప్రజల్లోకి వెళ్లి దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో ఆ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కూడా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది.

ఈ పథకానికి లిమిట్స్‌ లేవు….
మరో గొప్ప ఆలోచన ఏమిటంటే.. ఈ పథకానికి లిమిట్స్‌ లేవు. తల్లులూ.. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలను చదవించండి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన అందరికీ ఇస్తాం. కుటుంబాల జీవితాలు మారాలంటే.. సాధికారిత రావాలంటే ఈ పిల్లలు పెద్దవాళ్లు అయిన తర్వాత, పెద్ద చదువులు చదవగలిగితేనే భావి ప్రపంచంలో పోటీ వాతావరణంలో, మెరుగైన జీతాలతో, మంచి ఉద్యోగాలు చేస్తూ.. నాణ్యమైన జీవితాన్ని మెరుగుపరుస్తూ.. బ్రతకగలుగుతారు. ఈ అవకాశం ప్రతి అక్కకు, చెల్లెమ్మకు మంచి అన్నగా, తమ్ముడిగా, పిల్లలకు మంచి మేనమామగా ఇచ్చే గొప్ప కార్యక్రమమిది. దీనివల్ల సంపూర్ణంగా మంచి జరగాలని మనసారా కోరుతున్నాను.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు…
విద్యారంగంలో ఇవాళ విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి.
ఏ స్ధాయిలో జరుగుతున్నాయి అంటే… ఇవాళ మొట్టమొదట సారిగా ప్రయివేటు స్కూళ్ల నుంచి గవర్నమెంటు స్కూళ్లలో పిల్లలు చేరుతున్నారు. మనం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ స్కూళ్లలో 2018–19లో 37.50 లక్షల మంది విద్యార్ధులు ఉంటే… ఈరోజు 43.60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అంటే ఆరున్నర లక్షల మంది పిల్లలు ఇవాళ ప్రయివేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరిన పరిస్థితి. ఈ రోజు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ స్కూళ్లలో చేరేందుకు ఎమ్మెల్యేలు రికమెండేషన్‌ లెటర్‌ ఇచ్చి పంపిస్తున్న పరిస్ధితులున్నాయి.
నాడు–నేడు గొప్ప కాన్సెస్ట్‌తో సూళ్లు అన్ని రూపురేఖలు మారుతున్నాయి. సబ్జెక్టు టీచర్‌ అంశాన్ని ప్రవేశపెడుతున్నాం.
గతంలో క్లాస్‌ టీచర్లకే దిక్కు లేని పరిస్థితుల నుంచి ఏకంగా ప్రతి సబ్జెక్టుకు ఒక ప్రత్యేక టీచర్‌ను తీసుకొచ్చే గొప్ప ప్రక్రియను తీసుకొస్తున్నాం. మొత్తం ఇంగ్లిషు మీడియం చదువులు తీసుకొస్తున్నాం. సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసుకొస్తున్నాం. నాడు–నేడుతో క్షేత్రస్దాయిలో విప్లవాత్మక మార్పులు జరుతున్నాయి.

జగనన్న విద్యాకానుక…
అంతే కాకుండా గతంలో పిల్లలకు పుస్తకాలు ఎప్పుడిస్తున్నారో తెలియదు. స్కూళ్లు ప్రారంభమైన ఆరు నెలలు తర్వాత కూడా పుస్తకాలు ఇవ్వని పరిస్థితుల నుంచి, యూనిఫామ్‌ సకాలంలో ఇవ్వని పరిస్థితుల నుంచి ఇవాళ స్కూళ్లు మొదలయ్యే సమయానికే పిల్లలందరికీ జగనన్న విద్యా కానుక పేరుతో మూడు జతల బట్టలు, స్కూల్‌ బ్యాగు, మొట్టమొదటిసారిగా బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, నోట్‌ బుక్స్, వర్క్‌బుక్స్, షూ ఇస్తూ గొప్పఆలోచనతో అడుగులు వేస్తున్నాం.
ఆ స్ధాయి నుంచి చూస్తే… పిల్లల మెనూ గురించి మనం తప్ప. ఇంతగా ఆలోచించిన ముఖ్యమంత్రి బహుశా ఎవరూ ఉండరు. పిల్లలు ఏం తింటున్నారు, రోజూ అదే మెనూ అయితే పిల్లలకు రుచి నచ్చదని.. ఏకంగా రోజుకొక మెనూ ఇస్తూ ఆ పిల్లలకు అన్ని రకాలుగా మంచి ఆహారం ఇవ్వడానికి జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో మిడ్‌ డే మీల్‌కు సరుకులకు కూడా 7, 8 నెలల వరకు డబ్బులిచ్చేవరు కాదు. ఆయాలకు కూడా డబ్బులిచ్చేవారు కాదు. ఆ పరిస్థితి నుంచి విప్లవాత్మకంగా మార్పులు చేశాం. గోరుముద్ద అనే పథకానికి గతంలో సంవత్సరానికి రూ. 600 కోట్లు అయ్యే పథకానికి ఈరోజు రూ.1800 కోట్లు అవుతుంది. ఇవాళ పాఠశాలల్లో కూడా రూపురేఖలు పూర్తిగా మారుస్తూ.. తల్లుల్ని కూడా మోటివేట్‌ చేస్తున్నాం. అమ్మఒడి అనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఎన్‌రోల్‌మెంట్‌ను గణనీయంగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం.

ఉన్నత విద్యలో కూడా…
ఉన్నత విద్యలో సిలబస్‌లో కూడా పెద్ద ఎత్తున మార్పులు తెస్తున్నాం. జాబ్‌ ఓరియెంటెడ్‌ సిలబస్‌ను తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అప్రంటిషిప్‌ విధానం తప్పనిసరి చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నాం. విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో చోటుచేసుకుంటున్నాయి.

వీటన్నింటి వల్ల పిల్లలు బాగుపడాలి, పిల్లలకు మంచి జరగాలని ఆరాటపడుతూ.. మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, దేవుడు చల్లగా ఆశీర్వదించాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
పిల్లలకు దేవుడి దయ ఉండాలని, బాగా మంచి చదువులు చదువుకునే పరిస్థితులు రావాలని కోరుకుంటున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.

అనంతరం అక్టోబరు – డిసెంబరు, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు రూ.709 కోట్లను సచివాలయంలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ జమ చేసారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *