Breaking News

వృద్ధులకు సేవ చేయడం ఒక అదృష్టం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వృద్ధుల సమస్యల పరిష్కారానికి సమాజంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని, వేధింపులు, ఆరోగ్య సమస్యల నుంచి వృద్ధులను సంరక్షించేందుకు అందరూ చొరవ చూపాలని, వృద్ధులకు సేవచేయడం ఒక అదృష్టంగా భావించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పిలుపునిచ్చారు.
గురువారం ఉదయం స్థానిక ఈడేపల్లి లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహణలో జెట్టి నరసింహం స్మారక వృద్ధాశ్రమంను మంత్రి సందర్శించారు. 30 మంది మహిళలు, 21 మంది పురుషులు ఆశ్రయం పొందుతున్నారు. కృష్ణాజిల్లా మంటాడ సమీపం లోని తాడంకి ప్రాంతానికి చెందిన 85 ఏళ్ళ పోట్రు రామయ్య అనే వృద్ధుడిని మంత్రి పేర్ని నాని రామయ్య గారు మీ ఆరోగ్యం బాగుందా అని ఆప్యాయంగా పలకరించారు. మీకు గెడ్డం ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారని మరో వృద్ధుడిని మంత్రి అడిగారు. తమ వద్దకు నాగేంద్రం అనే బార్బర్ 15 రోజులకు ఒకసారి వచ్చి 20 రూపాయలు తీసుకోని తొలగిస్తున్నారని జవాబు ఇచ్చారు.ఇక నుంచి వారం రోజులకు ఒకమారు మీకు షేవ్ చేస్తారని, అందుకు అయ్యే ఖర్చు మొత్తం తానె చెల్లిస్తానని ఆ విషయం ఇకపై కో – ఆప్షన్ సభ్యులు బేతపూడి రవి పర్యవేక్షిస్తారని మంత్రి చెప్పారు. తమకు ఎపుడైనా అనారోగ్యం సంభవిస్తే ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే, చాలా ఇబ్బందిగా వృద్ధాశ్రమంలో ఒక పురుష సహాయకుడిని దయచేసి నియమించాలని రామయ్య అభ్యర్ధించారు.వెంటనే స్పందించిన మంత్రి నగరపాలక సంస్థ కమీషనర్ శివరామకృష్ణ తో మాట్లాడి ఓర్పు మంచి నడవడిక గల ఒక మునిసిపల్ ఉద్యోగిని తక్షణమే ఇక్కడ నియమించాలని ఆదేశించారు. వృద్ధాశ్రమలో వంటలు చేసే జోగి కొండను పలకరించి ఆహార మెనూ గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, వయసు రీత్యా పెద్దవాళ్లు మహావృక్షాల్లాంటి వారని, ఆధునిక జీవన శైలితో నిత్యం అశాంతిగా బతికే నేటి యువతకు వీరు చల్లని నీడనిచ్చి సేద తీరుస్తారని అందుకే వృద్ధులను అభిమానంతో ఆదరించాలని సూచించారు. ‘మానవసేవే మాధవసేవ’గా వృద్ధులకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, నేటి సమాజంలో తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు బాగోగులు చూడటం అంటే చాలామంది ఇష్టపడడం లేదని ఎంతోమంది డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగం, వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులకు సక్రమంగా చూసుకోవాలనే ద్యాస మరిచిపోతున్నారని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. పూర్వకాలం ఎంతోమంది తమ తల్లిదండ్రులకు సేవచేయడం అదృష్టంగా భావించేవారని నేడు చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్లి కొందరు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ జీవితాలను కొనసాగిస్తున్నారు. ఇక్కడ వృద్ధాశ్రమం సూపరెండెంట్ లక్ష్మి దుర్గ క్రమశిక్షణతో కూడిన చక్కని నిర్వహణలో ఎంతోమంది నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ ముందుకు సాగుతోందన్నారని మంత్రి ఆమెను ఈ సందర్భంగా ప్రశంసించారు.
పలువురు కంటి , పంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తాను గమనించానని త్వరలో దంత వైద్యులు డాక్టర్ రావి శ్రీనివాసరావు, కంటి వైద్యులు డాక్టర్ భాస్కరరెడ్డి ఈ వృద్ధాశ్రమానికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు, దంతాలు లేనివారికి పండ్ల సెట్లు అమర్చుతారని మంత్రి తెలిపారు. వృద్ధుల సంరక్షణ వారి పిల్లల కనీస బాధ్యతని వయసుడిగిన దశలో తమ వారసుల నుంచి వారు కోరుకునేది ప్రేమ పూర్వక పలకరింపు, ఆదరణ, అభిమానాలే తప్ప- ఆడంబరాలు, విలాసాలు కాదని వారి పిల్లలు గ్రహించాలని ఆయన అన్నారు.
ఈ వృద్ధాశ్రమ సందర్శన కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని వెంట మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, స్థానిక ప్రముఖులు రిటైర్డ్ జడ్జ్ జెట్టి కృష్ణమూర్తి, మచిలీపట్నం మాజీ జెడ్పిటీసీ లంకె వెంకటేశ్వరరావు ( ఎల్వీయార్ ), కార్పోరేటర్లు బోగాది సాయిబాబు, రామ్ ప్రసాద్, మహ్మద్ సాహెబ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *