ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుభూతిగా ఉంటుంది… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దశాబ్ద కాలంగా వేలాదిమంది ఆర్టీసీ ఉద్యోగులు అభద్రతా భావంతో ఉండేవారిని, ప్రభుత్వ ఉద్యోగిగా మారాలనే వారి చిరకాల వాంఛ ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చారని, ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుభూతిగా ఉంటుందని రాష్ట్ర రవాణా ,సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలలో తన శాఖలకు సంబంధించి క్వశ్చన్ అవర్ ఉండటంతో ఉదయం 7:30 గంటల సమయంలో మంత్రి పేర్ని నాని హడావిడిగా తాడేపల్లి ప్రయాణమవుతూ, తన కార్యాలయంకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు ఆ సమయంలోనూ తెలుసుకొన్నారు.
ఆర్టీసీలో డ్రైవర్లుగా ఎంపిక చేసినపుడు వివిధరకాలైన మెడికల్ పరీక్షలు జరిపిన అనంతరం ఆ ఉద్యోగాలకు తమను ఎంపిక చెశారని, ఆ తర్వాత ప్రతి మూడేళ్ళుగా పలుదఫాలు నేత్ర పరీక్షలు జరుగుతూనే ఉంటున్నాయని ఏ ప్రమాదం లేకుండా సురక్షితమైన డ్రైవింగ్ తో పది పదిహేనేళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్లగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని ఇటీవల తమకు వర్ణాంధత్వం లోపం ఉందనే కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 26 మందిని డ్రైవర్ ఉద్యోగాల నుంచి తొలగించారని, పలువురు మంత్రి పేర్ని నాని వద్ద మొర పెట్టుకొన్నారు. ఉద్యోగ నియామకాల సమయంలో మీరంతా కంటి పరీక్షలు జరిపే వైద్యులకు లంచాలు ఇచ్చి ఆనాడు డ్రైవర్లగా ఎంపికయ్యారని లేనిపోని నిందలు వేస్తున్నారని , 45 ఏళ్ళ వయస్సు లోపు డ్రైవర్లకు ప్రతి మూడేళ్లకోమారు, 45 ఏళ్ళ వయస్సు దాటిన వారికి ప్రతి ఏడాది కంటి పరీక్షలు జరుపుతారని, కలర్ బ్లయిండ్నెస్ లోపం ఈ పదిహేనేళ్లలో డాక్టర్లు ఎందుకు పసిగట్టలేదని, తమకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, కానీ ఆర్టీసీ యాజమాన్యం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, తమ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఆ స్థాయికి వెళ్లి వాదనకు దిగలేమని తమరే మాకు న్యాయం చేయాలనీ మంత్రి ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, మీ సమస్య పట్ల తనకు పూర్తి సానుభూతి ఉందని, మీరు ఎదుర్కొంటున్న సమస్య విషయమై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృష్టికి తప్పక తీసుకెళతానని అన్నారు. ప్రపంచంలో 12 మంది పురుషులలో ఒకరికి మరియు 200 మంది మహిళలలో ఒకరికి ఈ వర్ణాంధత్వ లోపం వస్తుందని చెప్పారు. ఈ లోపం ఉన్న వ్యక్తులు, ఇతర వ్యక్తులలా స్పష్టంగా చూడగలరు. కానీ, వారు ఎరుపు, ఆకుపచ్చ, నీలం కాంతిని పూర్తిగా చూడలేరన్నారు. రక రకాల వర్ణాంధత్వాలు ఉన్నాయిని, చాలా అరుదైన సందర్భాల్లో కొంత మంది వ్యక్తులు ఏ రంగును చూడలేరని అన్నారు. ఈ వ్యాధి రావటానికి చాలా కారణాలు ఉన్నాయిని కొంతమంది వ్యక్తులు దయాబెటీస్ ఇతర వ్యాధుల ఫలితంగా వర్ణాంధత్వాం వస్తుందని మంత్రి తెలిపారు.
అనంతరం మచిలీపట్నం రూరల్ కేబుల్ ఆపరేటర్లు పలువురు మంత్రిని కలిసి తమ ఇబ్బందిని చెప్పారు. కేబుల్ కనెక్షన్ ఇచ్చేందుకు విద్యుత్ పోల్స్ ఆధారంగా కేబుల్ వైర్లు ఏర్పాటు చేసుకోన్నామని, ఒకొక్క విద్యుత్ పోల్ కు నిర్దేశిత రుసుము విద్యుత్తు శాఖకు చెల్లిస్తున్నామని, అయితే ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాలలో పోల్ కు 20 రూపాయలు ఉండే ట్యాక్స్ ను 50 రూపాయలకు , మండల కేంద్రాలు మున్సిపాల్టీలలో 20 రూపాయలు ఉండే ట్యాక్స్ 75 రూపాయలకు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలలో 100 రూపాయలకు విద్యుత్ శాఖ తాజాగా పెంచటం జరిగిందన్నారు. వినియోగదారునికి ఒక కేబుల్ కనెక్షన్ ఇచ్చేందుకు రెండు లేదా మూడు విద్యుత్ పోల్స్ ను ఆధారంగా చేసుకోవాల్సి వస్తుందని, ప్రభుత్వం పోల్ ట్యాక్స్ విధించటం వల్ల ఒకొక్క కనెక్షన్ ఇచ్చేందుకు దాదాపు 300 రూపాయలకు పైగా ఆపరేటర్ వ్యయం అవుతుందని వారు చెప్పారు. ఈ నేపధ్యంలో ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది లక్షలాది మంది నిరుద్యోగులు ఆధారపడి జీవనం సాగిస్తున్న కేబుల్ రంగం దీనివల్ల ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా పోల్ ట్యాక్స్ రద్దు చేస్తామని తమకు హామీ ఇచ్చారని సదరు హామీ అమలు పరచకుండా పోల్ ట్యాక్స్ విపరీతంగా పెంచటం వల్ల కేబుల్ ఆపరేటర్లు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ సమస్య విన్నవించడం జరిగిందని తెలిపారు. తమరు దయవుంచి పోల్ ట్యాక్స్ రద్దు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేబుల్ రంగాన్నీ కాపాడవల్సినదిగా మంత్రి పేర్ని నానిని వారు వేడుకొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *