సీఎంను కలిసిన ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన ఏపీ వైద్య విద్యార్థులు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం కలిశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో పడ్డ ఇబ్బందుల్ని సీఎం జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ యుద్ధ పరిస్థితుల వల్ల ఉక్రెయిన్ ‌నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా.. వారికి వెంటనే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తన ఆదేశాలను అందుకున్న వెంటనే వారంతా రంగంలోకి దిగారని చెప్పారు. విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తూ చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అధికారులు తనకు నివేదించారని తెలిపారు. మీరంతా రాష్ట్రానికి చెందినవారని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ బాగోగులు చూసుకోవడం తమ బాధ్యతని సీఎం జగన్‌ తెలిపారు. దాన్ని అధికారులు సక్రమంగా నిర్వర్తించారని చెప్పారు. విద్యార్ధులను సురక్షితంగా తీసుకురావడంలో సమర్ధవంతంగా వ్యవహరించిన అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకు తగిన పరిష్కారం లభించేలా మార్గాలను అన్వేషించాలని అధికారులను సీఎం అదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తెలిపారు. తర్వాత విద్యార్థులతో వివిధ అంశాలపై సీఎం కొద్దిసేపు మాట్లాడారు. విద్యార్థుల చదువులు గురించి ఆరా తీశారు. విద్యార్థులు వారు కోర్సులను ఎంతవరకు పూర్తిచేశారో తెలుసుకున్నారు. తదుపరి వారి కోర్సులు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పరంగా అండగా నిలుస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ విద్యార్థులకు హామీ ఇచ్చారు.

వీవీఐపీల్లా చూసుకున్నారు…
ఉక్రెయిన్‌నుంచి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందని సీఎంకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. దేశం మొత్తంమీద ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అన్నిరకాలుగా చర్యలు తీసుకుందన్నారు సీఎం. ఉక్రెయిన్‌ సమీప దేశాలకు చేరుకున్న దగ్గరనుంచి ఆహారం, వసతి విషయాల్లో బాగా చూసుకున్నారన్నారు విద్యార్థులు. దీంతోపాటు దేశంలో అడుగుపెట్టిన దగ్గరనుంచి కూడా స్వస్థలాలకు చేరేంత వరకూ కూడా ఫ్లైట్‌టిక్కెట్లు దగ్గరనుంచి ప్రయాణ, వసతి సదుపాయాలను ఏర్పాటు చేశారన్నారు  విద్యార్థులు. ఎయిర్‌పోర్టుల్లో వీవీఐపీల తరహాలో స్వాగతం పలికారని, ఆ తరహాలో అన్ని సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు అధికారులు. చేసిన పనిని చెప్పుకోకుండా… వెనుకనుండి యంత్రాంగాన్ని సీఎం నడిపిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు  విద్యార్థులు. ఈ తరహా చర్యలు తీసుకున్నప్పుడు సహజంగానే విపరీత ప్రచారం చేసుకుంటారని, సామాజిక మాధ్యమాల వేదికగా తమను తాము ప్రశంసించుకుంటారని.. అలాంటి పోకడలకు ఏపీ ప్రభుత్వం, అధికారులు దూరంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు  విద్యార్ధులు. చేయాలనుకున్న పనిని చిత్తశుద్ధితో చేసిన తీరు తమకు స్ఫూర్తిదాయకమని సీఎంతో విద్యార్థులు అన్నారు. డాక్టర్‌వైయస్సార్‌  స్ఫూర్తితో వైద్యవిద్యను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నానని కడపకు చెందిన విద్యార్థిని తెలిపారు. మా అందరికీ మీ ఆశీర్వాదాలు ఉండాలని సీఎంను విద్యార్థులు కోరారు. తమకు అండగా నిలిచినందుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఉక్రెయిన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ప్రెసిడెంట్‌ మేడపాటి వెంకట్, సీఈఓ కె దినేష్‌ కుమార్, టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సభ్యులు అహ్మద్‌ బాబు, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, యూకేలో ప్రత్యేక ప్రతినిధి రవి రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *