మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మానవాళికి ఎంతో ప్రమాదకరమైన క్షయ వ్యాధి నివారణ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తతో ఉండాలని, మార్చి 24 వ తేదీన ‘ వరల్డ్ టీబి డే ‘ సందర్భంగా ఆ వ్యాధిపై జిల్లావ్యాప్తంగా 21 టీ బి యూనిట్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా క్షయవ్యాధి నివారణాధికారిణి జి. జె నాగలక్ష్మి తెలిపారు. కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె అన్నారు. విజయవాడ వరల్డ్ విజన్, ఫాక్ట్ ప్రాజెక్ట్ సంయుక్త సహకారంతో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలను మరింత అప్రమత్తం చేస్తూ పలు కూడళ్లలో కళాకారుల చేత క్షయ వ్యాధిపై కళాజాత , కర పత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మచిలీపట్నం సీనియర్ ట్రీట్మెంట్ సూపెర్వైజర్ విజయ గౌరీ , పి బి హెల్త్ విజిటర్ ప్రసాద్ బాబు , డాట్ ప్లస్ సూపెర్వైజర్ ధనలక్ష్మి , ఎం పి హెచ్ ఎస్ మురళి, సుధాకర్ లు మాట్లాడుతూ, గతంలో ఈ వ్యాధి నివారణకు పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండేవి కావని కానీ, అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి ఇపుడు వచ్చాయని . ప్రాథమిక దశలోనే గుర్తిసే నివారణ అత్యంత సులువని, మందులు వాడడంలో నిర్లక్ష్యం వీడితేనే క్షయ నివారణ సాధ్యమని అందరికి అర్థమయ్యేలా చెబుతున్నారు. క్షయ వ్యాధిని మొదటి దశలో ఉదయం వ్యాధిగ్రస్తుడు ఉమ్మిన తెమడను పరీక్షించి నిర్ధారిస్తారు. ఎక్స్‌రే ద్వారా సైతం నిర్ధారించవచ్చని . కలర్ పరీక్ష ద్వారా క్షయ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సీబీనాట్ అనే పరీక్ష ద్వారా రెండు గంటల్లో వ్యాధిని నిర్ధారించవచ్చు. కానిట్రెడ్జ్ బెస్ట్ న్యూక్లిక్ ఆసిడ్ ఆంప్లిఫికేషన్ (సీబీనాట్) పరీక్ష విధానంలో తెమడ పరీక్ష కాకుండా మిగతా డయాలాజికల్ నమూనాలు అన్నింటినీ తీసుకొని పరీక్ష చేస్తారు. తద్వారా సత్వర నిర్ధారణతో పాటు ఈ పరీక్ష ద్వారా ఎండీఆర్, టీబీగా నిర్ధారణ అయితే తక్షణమే వైద్యాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు టీబీ సోకే అవకాశం మెండుగా ఉంటుంది. 60శాతం హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు క్షయ సోకుతుంది. వీరిలో ఒకరోజు కన్నా ఎక్కువ దగ్గు , జ్వరం ఉండడం, రాత్రివేళల్లో చెమటలు పట్టడం, అకారణంగా నీరసం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వారికి టీబీ సోకినట్లుగా నిర్ధారించవచ్చు.ఈ లక్షణాలు ఉన్నవారు టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. టీబీ అంటువ్యాధి అని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని సూచించారు. క్షయ వ్యాధి శరీరంలో వెంట్రుకలకు, గోర్లకు తప్ప అన్ని భాగంలో వస్తుంది అని తెలిపారు. 15 రోజులకు మించి దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి, బరువు తగ్గడం, కళ్లెలో రక్తం పడటం వంటి లక్షణాలలో ఒక్క లక్షణం కనిపించిన దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో తెమడ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పుట్టిన ప్రతి బిడ్డకు బిసిజి వాక్సిన్ వేయించాలి అన్నారు. క్షయ వ్యాధిని రూపు మాపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, విద్యార్థులు ఇతరులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పుట్టిన పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇప్పించాలి. దగ్గినా, తుమ్మినా నోటికి గుడ్డ లేదా రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మరాదు. ఉమ్మితే దానిపై మట్టిని కప్పాలి. ఎక్కువ ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లో ఆరేండ్లలోపు పిల్లలు ఉంటే వారికి వైద్యుడి సలహా మేరకు ఐసోనియోజైడ్ మందులను ఇప్పించాలి. వ్యాధిగ్రస్తులు వైద్యుడి సలహా మేరకు నిర్ణీత సమయం వరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. వ్యాధి లక్షణాలు తగ్గినట్లు అనిపిస్తే మందులు వేసుకోవడం మానరాదు. కోర్సు మధ్యలో మందులు మానేస్తే అవి శరీరంపై పనిచేయకుండా పోతాయిని,ఇలాంటి సమయంలో వ్యాధిని నివారించడం కష్టతరమవుతుంది. వ్యాధిగ్రస్తులు మందులు వాడుతున్న సమయంలో యాక్షన్, రియాక్షన్ ఏమీ ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారులు ప్రచారం చేస్తున్నారు.
