విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏఈఎల్ చర్చి పాలక మండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను తక్షణం అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి, డీజీపీకి ఏఈఎల్ అధ్యక్షుడు, మోడరేటర్ బిషప్ కె.వి.ప్రసన్న కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయయై మంగళవారం ఉదయం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఈఎల్ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. తాము చట్ట ప్రకారం, ఏఈఎల్‌సి బైలాస్‌కి లోబడి 27- 05- 2021న ఎన్నికోబడినట్లు తెలిపారు. అయినప్పటికీ కొద్ది మంది రాజకీయ నాయకుల అండదండలతో రౌడీషీటర్ లాజరస్ అనే కర్ణాటకకు చెందిన వ్యక్తి కొద్ది మంది రౌడీలతో చర్చిని ఏడాది కాలంగా ఆక్రమించాడని పేర్కొన్నారు. ఈ విషయమై హైకోర్టు ఇచ్చిన రెండు మధ్యంతర ఉత్తర్వులను కూడా అమలు చేయకుండా గుంటూరు ఎస్పీ తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నోసార్లు పలువురు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. చివరకు హైకోర్టు దీనిని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పరిగణించి 16-03-2022న అధికారులను మందలించి 30-03-2022 లోగా ఉత్తర్వులను అమలు పరచాలని ఆదేశించారని తెలిపారు. ఈ నేపధ్యంలో సీఎం వైయస్ జగన్మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని తగిన విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ గుంటూరు బిషప్ బాబురావు మాట్లాడుతూ తమకు సత్వరం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చర్చిలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు బ్రదర్ అనిల్‌కుమార్ పేరును ఉపయోగిస్తూ పోలీసుల ద్వారా అందరికీ ఫోన్లు చేయిస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో అడిషనల్ ఎస్పీ జాషువా కాల్ లిస్ట్ తీస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని తెలిపారు. కొంతమంది చేస్తున్న అక్రమాల కారణంగా ప్రభుత్వానికి, ముఖ్‌యమంత్రికి చెడ్డ పేరు రావడంతో పాటు భారతదేశంలోనే అతి పెద్ద చర్చి 30 లక్షల మంది విశ్వాసులు కలిగిన సంఘంలో వ్యతిరేకతకు కారణం అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ముఖ్య మంత్రి, డీజీపీ స్పందించి వెంటనే హై కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రస్తుతం చర్చిలో జరుగుతున్న అక్రమాలను ఖండించారు.