– ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల
– ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
– ఆగస్టులో ఫలితాలు, సెప్టెంబర్ లో కౌన్సెలింగ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు ఏపీ ఈఏపీ సెట్(EAPCET)-2022 ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జూలై 4 నుంచి జూలై 12 వరకూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో జూలై 4 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు 10 సెషన్స్ లలలో పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్ విభాగంలో జూలై 11, 12 తేదీలలో రెండురోజుల్లో 4 సెషన్స్ లలో EAPCET పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయం రెండవ బ్లాక్ వద్ద మీడియాకు వివరాలను వెల్లడించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ…. ఏప్రిల్ 11న EAPCET నోటిఫికేషన్ విడుదల కానుందని, ఆ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను అందిస్తామని తెలిపారు. ఈ పరీక్షలు ఎప్పటిలాగే టీసీఎస్ అయాన్ సెంటర్లలో జరుగుతాయని, గతంలో 136 సెంటర్లలో నిర్వహించామని, ఈ సారి అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచుతామని తెలిపారు. తెలంగాణలోనూ 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మే 6 నుంచి మే 24 వరకూ ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేశామన్నారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆగష్టు 15నాటికి EAPCET ఫలితాలు, సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్, అక్టోబర్ రెండో వారంలో క్లాసులు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు తెలిపారు.