దేశానికి శ్రీలంక పరిస్థితులు తీసుకు రానివ్వద్దు

-జగన్ రెడ్డి తీరుతో రాష్ట్రంలోనూ సంక్షోభ పరిస్థితులు
-ప్రత్యేక హోదా పై ఇంకా మౌన మేనా ?
-రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేది కాంగ్రెస్ పార్టీనే
-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మత తత్వ శక్తుల పాలనతో దేశం సంక్షోభంలోకి పయనిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని, దేశానికి శ్రీలంక పరిస్థితులు రానివ్వద్దని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ కోరారు. నోట్ల రద్దు మొదలుకుని పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజల జీవితాలను బీజేపీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందని ఆరోపించారు. బ్యాంకులనుంచి రుణాలు పొంది విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకురాలేని దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆదాయం తక్కువ..వ్యయం ఎక్కువ చేస్తూ పధకాల పేరుతో అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా పంచి పెడుతూ ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తోందని ఆరోపించారు. జగన్ రెడ్డి తీరుతో రాష్ట్రంలోనూ ఎదో ఒకరోజు సంక్షోభ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని శైలజనాథ్ హెచ్చరించారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాల పని తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం పలు మార్లు స్పష్టం చేసినా వైసీపీ నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ సాధన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని శైలజనాథ్ పేర్కొన్నారు. తెదేపా, వైకాపా, జనసేన వంటి ప్రాంతీయ పార్టీలతో ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసి ఏడేళ్లు అయిందని, ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న భాజపా నేడు అది ముగిసిన అధ్యాయమని మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన లోటు బడ్జెట్ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని శైలజనాథ్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తెదేపా, వైకాపా, జనసేన వంటి ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే వాటి సాధన సాధ్యమన్నారు. 25 ఎంపీలు ఇస్తే హోదా సాధిస్తామని చెప్పిన వైకాపా ఎంపీలు కేంద్రం ముందు మోకరిల్లారని ఆరోపించారు. విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శైలజనాథ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని, ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో ఆవశ్యకమన్నారు. అధికారం ముందర హోదాపై ప్రగాల్భాలు పలికిన వైకాపా ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలకు ఇతర నిధులను వినియోగిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నారని విమర్శించారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *