కేంద్రం విడుదల చేసిన రూ.7,659 కోట్లు నిధులు ఏవీ ?

-1,309 కోట్లకు పైగా నిధులు మ‌ళ్లించ‌డం రాజ్యాంగ విరుద్ధం
-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామస్థాయిలో అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను జగన్ రెడ్డి సర్కారు పక్కదారి పట్టిస్తోందని శైలజనాధ్ విమర్శించారు. నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం దొడ్డిదారిన నిధులు మళ్లించడం చూస్తే రాష్ట్ర ఖజానా దుస్థితి తేటతెల్లం అవుతోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు అందే 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ఇతరత్రా అవసరాలకు వినియోగించడం తగదని, ఈ నిధులు పూర్తిస్థాయిలో రాష్ట్రానికి అందలేదని సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 ఆగస్టు 1 నుంచి , 2021 ఏప్రిల్‌ 2 వరకు గ్రామపంచాయతీల ఎన్నికలు జరగకపోవడంతో సర్పంచ్‌లు అధికారంలో లేరని, ఆ తర్వాత 2021లో ఎన్నికలు జరిగి నూతన సర్పంచ్‌లు అదే ఏడాది ఏప్రిల్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారని, మొత్తం 12,918 గ్రామ పంచాయతీల్లో సీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌ చూపిస్తున్నాయని పేర్కొన్నారు. రూ.7,659 కోట్లు రాష్ట్రానికి విడుదల చేశామని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి సమాధానమిచ్చారని, ఆ నిధులు ఏం చేశారో ప్రభుత్వం సమాధానమివ్వాలని శైలజనాథ్ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లు వచ్చిన కొత్తలో రూ.345 కోట్లు ఓ సారి, రూ.969 కోట్లు మరోసారి వారికి తెలియకుండా విద్యుత్‌ చార్జీల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని, ఇలా నిధులు దారి మళ్లించి సీఎఫ్ఎంఎస్ అకౌంట్లలో జీరో బ్యాలెన్స్‌ చూపించారని ఆరోపించారు. ఆదాయ వనరులు లేని పంచాయతీలకొచ్చే అరకొర నిధులు కూడా సచివాలయ నిర్వహణ పేరుతో ప్రభుత్వం వాడేసుకుంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,918 పంచాయ‌తీల నుంచి రెండున్నరేళ్ల పాల‌న‌లో 1,309 కోట్లకు పైగా నిధులు మ‌ళ్లించ‌డం రాజ్యాంగ విరుద్ధమన్నారు. గ్రామపంచాయతీల నుంచి మ‌ళ్లించిన రూ.1,309 కోట్ల నిధులను త‌క్షణ‌మే పంచాయ‌తీ ఖాతాల‌లో జ‌మ‌చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *