జిల్లాలో 131 హాస్టళ్లను ‘మార్పు’ ద్వారా అభివృద్ధి: జిల్లా కలెక్టర్ జె.నివాస్

-విద్య అభ్యసించి పరిసరాలు సౌకర్యవంతంగా ఉంటే ఉత్తమ ఫలితాలు
-‘మార్పు’ తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ:
-గన్నవరం మండలం దావాజిగూడెంలో సంక్షేమ హాస్టల్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యనభ్యసించే ప్రదేశం ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉంటే మరింత ఏకాగ్రతతో విద్య అభ్యసించి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. గన్నవరం మండలం దావాజీగూడెంలోని సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, బీసీ బాలికల వసతి గృహాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ‘మార్పు’ కార్యక్రమం ద్వారా చేపడుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ వసతి గృహాల పరిసరాలు ఆహ్లాదకరంగానూ, కార్పోరేట్ స్థాయిలో సౌకర్యాలు అందిస్తే విద్యార్థులకు విద్యపై మరింత ఏకాగ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను ‘మార్పు’ కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామన్నారు. పేదరికం విద్యకు అడ్డు కాకూడదని ప్రతీ పేద విద్యార్థికి ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జిల్లాలోని 131 సంక్షేమ వసతి గృహాలను ‘ మార్పు’ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే పెనమలూరులో 17.05 లక్షలతో చేపట్టిన సంక్షేమ వసతి గృహం పనులు పూర్తి అయ్యాయన్నారు. దావాజిగూడెం, దొక్కిపర్రులలోని బాలికల సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి పనులు పూర్తి అయ్యే దశలలో ఉన్నాయన్నారు. దావాజిగూడెంలోని బాలికల సంక్షేమ వసతి గృహానికి, బీసీ బాలికల వసతి గృహానికి 17.5 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేశామని, పనులు పూర్తి నాణ్యతతో ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. ‘మార్పు’ కార్యక్రమం ద్వారా సంక్షేమ వసతి గృహాలలో టాయిలెట్స్, బాత్రూములు, విద్యార్థులు వసతి గదులను ఆధునిక టైల్స్, వాష్ బేసిన్స్, కమోడ్స్ వంటి మెటీరియల్స్ పూర్తి నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆధికారులను కలెక్టర్ ఆదేశించారు. మెటీరియల్స్ ధరలు నిర్ణయించేందుకు కొనుగోలుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ని నియమించడం జరిగిందన్నారు. వసతి గృహాలలో చేపట్టే పనులు పూర్తి నాణ్యతతో ఉండేలా పర్యవేక్షించేందుకు ప్రభుత్వ శాఖలలోని అసిస్టెంట్ ఇంజినీర్ స్థాయి అధికారులు ఒకొక్కరు ఒకొక్క హాస్టల్ ను దత్తత తీసుకుని పనుల ప్రగతిని పరిశీలిస్తారన్నారు. స్టూడెంట్స్ గదులలో చదువుకునేందుకు అవసరమైన వెలుతురుకు ట్యూబులైట్స్, ఫ్యాన్లు, కిటికీలు, దోమతెరలు తదితర సౌకర్యాలతోపాటు, ఏ హాస్టల్ కు ఏ విధమైన మౌలిక సదుపాయాలు అవసరమో పరిశీలించి అందుకు తగిన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో ఉన్నత విద్యాభ్యాసాన్ని అందిపుచ్చుకుని, ఉన్నత అందుకునేలా కృషి చేయాలని విద్యార్థినులను ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్ నరసింహారావు, ఎంపిడిఓ వై. సుభాషిణి, సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ శాఖాధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *