-వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మిల్క్ ప్రాజెక్ట్ నందు వి-కన్వెన్షన్ హాల్ నందు 37, 46, 47, 50, 51 మరియు 53వ డివిజన్లకు సంబందించి జరిగిన వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరై స్వయం సహాయక సంఘాల వారికీ చెక్కులను అందజేసారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకంతో మహిళల జీవితాల్లో నూతన వెలుగులు వచ్చాయన్నారు. మహిళ సాధికారతే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశగా అడుగులు వేస్తోన్న జగనన్న ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలు తోడ్పాటును అందించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తూ వారిని లక్షాధికారులుగా చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేసిందని పేర్కొన్నారు. తదుపరి ఆయా డివిజన్ లకు సంబందించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పధకం క్రింద మూడవ విడతగా 874 స్వయం సహాయక సంఘాలలోని 8740 మంది అక్కా చెల్లెమ్మలకు రూ. 1,18,77,766/- విలువైన చెక్కును అందజేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం మేయర్ కార్పొరేటర్లతో కలసి ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమములో కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ రావు, మరుపిళ్ళ రాజేష్, గోదావరి గంగ, జోనల్ కమిషనర్ సుధాకర్, యు.సి.డి సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.