విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లోక కల్యాణం కోసం కఠోర తపస్సు చేసి పవిత్ర గంగను దివి నుండి భువికి తీసుకువచ్చిన మహర్షి అపర భగీరథుడని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా భగీరథ జయంతి వేడుకలు ఆదివారం నిరాడంబరంగా జరిగాయి. ముత్యాలంపాడులో జరిగిన వేడుకలలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. పూలమాలలు వేసి ఆ మహర్షికి ఘన నివాళులర్పించారు. అనంతరం భగీరథ ఋషి జీవిత చరిత్రను స్మరించుకున్నారు. భగీరథుడు ఒక్క సగర ప్రజలకే కాదు.. యావత్ హైందవ ప్రజానీకానికి ఆరాధ్యుడు, పూజనీయుడని మల్లాది విష్ణు పేర్కొన్నారు. దీక్షకు, సహనానికి ప్రతిరూపమని కీర్తించారు. మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రాణికోటి కష్టాలు తీర్చిన మహర్షి భగీరథుడని వ్యాఖ్యానించారు. కనుకనే ఎంత కష్టాన్ని లెక్కచేయకుండా, అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికి తాగు నీరిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో నాయకులు కె. వెంకటేశ్వర రావు, నక్కా గోవింద్, కర్నాటి సత్తి, కాళ్ళ ఆదినారాయణ, బి. వి. ఆచారి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News