-ఆంధ్రప్రదేశ్లోని 16 మునిసిపల్ కార్పొరేషన్లలో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ నిర్వహించడానికి ఏపీఎస్ఈసిఎంకు బీఈఈ ఆర్థిక సహాయం
-16 నగర పాలక సంస్థల్లోని త్రాగునీటి సరఫరా, మురుగు నీటి పంపిణీ వ్యవస్థ లో విద్యుత్ వాడకం పై అధ్యయనం
-ఈ వ్యవస్థల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు ద్వారా పెధ్ద ఎత్తున విద్యుత్ పొదుపు.. తద్వారా విద్యుత్ బిల్లును ఆదా చేసే అవకాశం
-పురపాలక, నగర పాలక సంస్థల ఉద్యోగుల్లో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్యం పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించిన ఏపీఎస్ఈసిఎం
-నగర పాలక సంస్థల్లో త్రాగు నీరు, మురుగు నీరు పంపిణి వ్యవస్థల్లో విద్యుత్ వినియోగం పై పెద్ద ఎత్తున్న వ్యయం
-ఇంధన పొదుపు ద్వారా కొంత మేర విద్యుత్ బిల్లులలో ఆదాకు అవకాశం
-మునిసిపాలిటీలు , ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఏటా 3400 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం
-ఇంధన పోదుపు కార్యక్రమాల ద్వారా విద్యుత్ పొదుపునకు అవకాశం.
-ఎనర్జీ ఆడిట్ కు సహకరించాల్సిందిగా పురపాలక శాఖను కోరిన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్
-రాష్ట్రంలో నాణ్యమైన , చౌక విద్యుత్ సరఫరా కు ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు దోహదం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఇంధన పరిరక్షణ , ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను చేపట్టడంలో భాగంగా 16 మునిసిపల్ కార్పొరేషన్లలో ఇంధన పొదుపు అధ్యయనం (ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్) నిర్వహించేందుకు ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసిఎం)కు కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ ఆర్థిక సహాయాన్ని అందించింది. రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ సహకారం తో ఏపీఎస్ఈసిఎం ఇంధన పొదుపు పై అధ్యయనం నిర్వహించనుంది.
దీనిలో భాగంగా త్రాగు నీటి సరఫరా , మురుగు నీటి పంపిణి వ్యవస్థ లో విద్యుత్ వాడకం , విద్యుత్ పొదుపు అంశాల పై అధ్యయనం నిర్వహించి తగు సిఫార్సులు చేయనున్నారు . వాటిని అనుసరించి సదరు మునిసిపల్ కార్పొరేషన్ల లో విద్యుత్ పోదుపు పై చర్యలు చేపట్టడం ద్వారా ఆయా వ్యవస్థల నిర్మాణ సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు విద్యుత్ బిల్లులను కొంత మేర ఆదా చేసే అవకాశం లభిస్తుంది.
మునిసిపల్ కార్పొరేషన్లు ఆయా నగరాలలో వీధి దీపాలు, త్రాగు నీటి సరఫరా , మురుగు నీటి పంపిణి, తదితర వ్యవస్థల్లో పెధ్ద ఎత్తున విద్యుత్ వాడకం వల్ల భారీగా విద్యుత్ బిల్లుల రూపంలో వ్యయం చేస్తాయి . సదరు వ్యవస్థల్లో ఇంధన పొదుపు కార్యక్రమాలు చేపట్టడం వల్ల దాదాపు కనీసం 25 శాతం వరకు విద్యుత్ పొదుపు చేసే అవకాశం ఉందని బీఈఈ నివేదికల్లో పేర్కొంది.
ఇంధన సామర్థ్యం వల్ల కేవలం విద్యుత్ పొదుపు కాకుండా నిర్వహణ సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ దృష్ట్యా నగర పాలక సంస్థల్లోని త్రాగు నీటి సరఫరా , మురుగు నీటి పంపిణి వ్యవస్థలో ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు బీఈఈ మునిసిపల్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను చేపట్టింది. ఈ దృష్ట్యా రాష్ట్రంలో 16 నగర పాలక సంస్థల్లో ఏపీఎస్ఈసిఎం ఈ అధ్యయనాన్ని నిర్వహించనుంది. ఇందుకోసం న్యూ ఢిల్లీ కి చెందిన పీటీసి ఇండియా లిమిటెడ్ అనే ఎక్స్పర్ట్ సంస్థను టెండర్ ద్వారా ఖరారు చేయటం జరిగింది.
ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాల్సిందిగా పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి కు ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ విజ్ఞప్తి చేసారు. అలాగే రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అనుమతించినందుకు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రేకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున ఇంధన పొదుపు కార్యక్రమాలు చేపట్టడం వల్ల రాష్ట్రానికి ఇంధన భద్రత లభించడంతో పాటు ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కు కూడా దోహదపడుతుందని విజయానంద్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన , చౌక విద్యుత్ ను అందించాలన్నదే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని , ఇందుకు ఇంధన సామర్థ్యంతో పాటు పునరుత్పాదక ఇంధనం కూడా దోహద పడతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి పై ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు . విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించటం పై దృష్టి పెట్టాలని ఇంధన శాఖ మంత్రి ఆదేశించినట్లు విజయానంద్ చెప్పారు .
ఏపీఈఆర్సి టారిఫ్ ఆర్డర్(2021-22) ప్రకారం మునిసిపాలిటీలు , ఇతర ప్రభుత్వ సంస్థల్లో 3400 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఆయా సంస్థల్లో ఇంధన పొదుపు కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ను ఆదా చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఇంధన పొదుపు , ఇంధన పరిరక్షణ పై ప్రభుత్వ సంస్థల్లో అవగాహన కలిపించేందుకు ఏపీఎస్ఈసిఎం ఇంధన సామర్ధ్య అవగాహణ కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రధానంగా పురపాలక, నగర పాలక శాఖలో 16 మునిసిపల్ కార్పొరేషన్ల లో పనిచేస్తున్న ఉద్యోగులు, సాంకేతిక సిబ్బందికి ఇంధన సామర్ధ్య అంశాల పై అవగాహన కార్యక్రమాలు ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా సహకారం తో ఇప్పటికే నిర్వహించింది.
నగర పాలక సంస్థల్లో నిర్దేశిత సమయంలో ఇంధన పొదుపు అధ్యయనాన్ని పూర్తి చేసి తగిన సిఫార్సులు చేయటం జరుగుతుందని ఏపీఎస్ఈసిఎం అధికారులు తెలిపారు . తద్వారా ఆయా నగర పాలక సంస్థల్లో విద్యుత్ పొదుపు తో పాటు విద్యుత్ బిల్లులు ఆదా చేయడం, త్రాగు నీటి సరఫరా , మురుగునీటి పంపిణి వ్యవస్థల్లో విద్యుత్ సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కూడా దోహద పడుతుందని తెలిపారు.
Prajavartha Online Telugu News