Breaking News

యువతకు ఆయనొక రోల్ మోడల్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వంగవీటి మోహన రంగా 75వ జయంతి వేడుకలు
-పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేవీనగర్, పైపులరోడ్డు, పాయకాపురం, రాజీవ్ నగర్, ఎల్బీఎస్ నగర్, మధురానగర్, అయోధ్యనగర్ సహా పలు ప్రాంతాలలో నిర్వహించిన 75వ జయంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అభిమానులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. నిరుపేదల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటాలు చేసి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి వీఎం రంగా అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కొనియాడారు. సాయం కోరి వచ్చిన వ్యక్తికి నేనున్నా అంటూ భరోసా కల్పించేవారన్నారు. భారీవర్షాలు, వరదలకు నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురైన సమయంలో దగ్గరుండి బాధితులను ఆదుకున్నారన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా విద్యార్థి సంఘాల్లో అవగాహన కల్పించిన నేత వీఎం రంగా గారని మల్లాది విష్ణు అన్నారు. రాజకీయాలలోకి రావాలనుకునే యువతకు ఆయనొక రోల్ మోడల్ గా అభివర్ణించారు. 1980 నుంచి 1989 మధ్య దాదాపు దశాబ్ద కాలంపాటు ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి రంగా గారి ఆశీస్సుల ఎంతగానో ఉన్నాయన్నారు. పేదలకు అండగా నిలిచేతత్వమే రంగా గారికి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిపెట్టిందన్నారు.

తెలుగుదేశం నిరంకుశ విధానాలపై తిరుగులేని పోరాటం
1983 నుంచి 1989 వరకు నాటి తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ విధానాలపై వంగవీటి మోహన రంగా అలుపెరుగని పోరాటం చేశారని మల్లాది విష్ణు అన్నారు. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డుపై ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు. తనపై నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని దాష్టీకాలకు తెగబడినా.. ఎక్కడా వెనుకంజ వేయకుండా వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రజల కష్టాలను సొంత కష్టాలుగా పోరాడి విజయవాడ నగర ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. శిరోముండనం, లాకప్ డెత్ లు వంటి దుశ్చర్యలకు తెగబడుతూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తున్న తరుణంలో.. ప్రజలకు అండగా నిలిచారన్నారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీస్ బిల్లు తీసుకొచ్చిన సమయంలో.. పేదల తరపున పోరాటాలు చేసిన ఏకైక నాయకులు రంగా గారని చెప్పుకొచ్చారు. ఆయన నాయకత్వంలో విజయవాడ నగరం ఉద్యమాలకు వేదికగా మారిందన్నారు. గాంధీనగర్ సబ్ జైలులో ఉండి కూడా కృష్ణలంక డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందిన వ్యక్తి విజయవాడ చరిత్రలో ఒక్క రంగా గారేనని వ్యాఖ్యానించారు. కనుకనే కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. పేదలకు పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమాలలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *