-బూస్టర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిద్ వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కోవిడ్ చికిత్సను మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యలతో కోవిద్ మొదటి, రెండు వేవ్ లను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని పేర్కొన్నారు. కేంద్రం సైతం రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందిస్తూ లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ లో ఏపీ దూసుకుపోయిందని.. లక్ష్యానికి మించి తొలి రెండు డోసులను పూర్తిచేసినట్లు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ద్వారా స్పష్టమైందన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ బూస్టర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరూ ఈ డోసు తీసుకునేందుకు అర్హులేనని మల్లాది విష్ణు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రదేశాలలోనూ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో రోజుకి 15 లక్షల మందికి వ్యాక్సిన్ పూర్తి వేసే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద వైద్యుల పర్యవేక్షణ ఉంటుందని తెలియజేశారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఇప్పటివరకు రెండు డోసులు పూర్తిచేసిన వారిని గుర్తించి మూడవ డోసును అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిద్ నాల్గో దశ ప్రమాదం పొంచిఉన్న తరుణంలో ప్రజలందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. అలాగే ఇప్పటివరకు కోవిద్ వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ క్రాంతికిరణ్, నాయకులు అఫ్రోజ్, నేరెళ్ల శివ, మీసాల సత్యనారాయణ, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News