అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా వైరస్ ఊహించని విధంగా విస్తరిస్తోంది. కరోనా లక్షణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ కు, సెకండ్ వేవ్ కు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం వైరస్ పలు విధాలుగా మార్పులు చెందుతున్న తరుణంలో, వ్యాధి లక్షణాలు కూడా మారుతున్నాయి. గాలి ద్వారా కూడా కరోనా విస్తరిస్తోందని నిపుణులు చెపుతున్న మాటలు ఆందోళన కలిగించేవే. ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించకుండానే ఎంతో మంది వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాదులోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం మాట్లాడుతూ, కీలక విషయాలను వెల్లడించారు. తమ వద్దకు ఆరుగురు పేషెంట్లు కళ్లకలకతో వచ్చారని, వారికి టెస్టులు చేయిస్తే కరోనా పాజిటివ్ అని తేలిందని డాక్టర్ రాజలింగం తెలిపారు. కళ్ల వెంట నీరు కారడం, కళ్లు ఎర్రబారడం, కళ్లు తడారడం వంటి సమస్యలు తలెత్తిన వారు వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాలని ఆయన సూచించారు. కళ్ల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, ఆయాసం వంటి లక్షణాలే కాకుండా కంటి దురద, కళ్లకలకలు వంటివి వచ్చినా కరోనా కోణంలో అనుమానించాల్సిందే అని సూచించారు. కరోనా వల్ల కొందరిలో కంటిచూపు కూడా మందగిస్తోందని… అయితే భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సమస్య నుంచి గట్టెక్కవచ్చని తెలిపారు.
Tags AMARAVARTHI
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …