గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ యువత ప్రతిభకు అనుగుణంగా వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించి వారి ఆర్థిక పురోభివృద్ధికి చేయూత అందిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీ తెలిపారు. విజయవాడకు చెందిన స్మార్ట్ టెక్స్ కంపెనీ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గంలో ఎంపిక చేసిన పలువురు యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. వారిలో 12 మందికి బై జ్యూస్ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలను మంగళవారం అందజేసినట్లు వివరించారు. ఈ సంస్థలో పనిచేయడం ద్వారా ఒక్కొక్కరికి ఏడాదికి 7.5 లక్షలు ప్యాకేజీలో వేతనముగా వస్తుందన్నారు. ఇంకా మరికొన్ని ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. యువకుల్లో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని దానిని వెలికి తీయడం ద్వారా మంచి కంపెనీలలో ఉద్యోగం పొందడానికి వీలుంటుందని వంశీ తెలిపారు. మీలో ప్రతిభ ఉందా తన వద్దకు వస్తే జాతీయస్థాయి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన వారు బెంగుళూర్, కర్నూల్, హైదరాబాద్ వంటి నగరాల్లో పనిచేస్తారన్నారు. తమకు ఉద్యోగాలు ఇప్పించిన ఎమ్మెల్యే వంశీకి యువకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ టెక్స్ సీఈవో దివ్య పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News