మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ, ఆక్వా రంగాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టరు పి.రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జిల్లా అధ్యక్షులు జన్ను రాఘవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ గ్రామ, మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుని జిల్లా స్థాయిలో చర్చించి ప్రభుత్వానికి నివేదించి , అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్, రభీ పంటకాలాల్లో తప్పనిసరిగా ఈ క్రాప్ ద్వారా రైతులు తమ పంటలను నమోదు చేసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 67 శాతం మాత్రమే ఈ కేవైసీ జరగడంపై కలెక్టర్ వ్యవసాయ జెడి పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెల 25వ తారీకు లోపు ఈ కేవైసీ 100% పూర్తి చేయాలని ఆదేశించారు. పకృతి వైపరీత్యాలు, దాన్యం కొనుగోలు, రాయితీపై విత్తనాలు, సున్నా వడ్డీ పంటల రుణాలు, పంటల భీమా, ఎరువులు, పురుగు మందుల సబ్సిడీ ఈ క్రాప్ డేటా ద్వారానే రైతులు పొందగలరన్నారు. ఇదే విధానం ఆక్వా, ఉద్యానవన పంటలకు కూడా అమలు జరుగుతుందన్నారు. ఈ క్రాపు నమోదులో వ్యవసాయ అధికారులతో పాటు రైతులు కూడా అంతే బాధ్యత ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లించాల్సిన నగదు సకాలంలో జమచేయడం జరిగిందని, ఒకటి రెండు చోట్ల సాంకేతిక సమస్యల వలన ఆగినా సరిచేసి వెంటనే జమ చెయ్యాలని అధికారులకు అయన ఆదేశించారు. ఆక్వా కల్చర్ లో ప్రమాదకరమైన రసాయనాలు విచ్చలవిడిగా కొందరు రైతులు వినియోగిస్తున్నారని మత్స్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాదాపు 100 రకాల ఆక్వా మెడిసిన్స్ వివిధ దుకాణాల్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి అన్నారు. లైసెన్సు లేని మందులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై సర్వే పూర్తయిన చల్లపల్లి మోపిదేవి ఘంటసాల తదితర ప్రాంతాల్లో భూములు అనుకూలంగా ఉన్నాయని వచ్చే ఏడాది నుంచి ఆయిల్ పామ్ ఈ ప్రాంతాల్లో రైతులు సాగు చేయనున్నట్లు తెలిపారు. తెల్ల రంగు పశువుల్లో లంపి వైరస్ ప్రబలుతుందని జిల్లా పశు వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానం కలిగిన ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి పశువులకు టీకాలు వేయాలన్నారు. డ్రైయిన్ లలో పూడికతీత పనులు చేపట్టడం జరిగిందని, రైతుల విజ్ఞప్తి మేరకు డ్రెయిన్లుపై అక్రమణలను తొలగించడం జరిగిందని జిల్లా కలెక్టరు తెలిపారు. మండలం స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశంకు సంబంధిత అధికారులు గైర్హజరు పై జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. మంచి ఉద్దేశంతో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశాన్ని సక్రమంగా కచ్చితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాస్థాయిలో ఉన్న సమస్యలను వెంటనే సంబంధిత శాఖ అధికారులు పరిష్కరించే దిశగా కార్యచరణ ఏర్పాటు చేసి మరలా ఈ సమావేశంకు యాక్షన్ ప్లాన్ నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాస్థాయిలో ఉన్న సమస్యలు, సూచనలు ప్రతి నెల నాలుగో శుక్రవారం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వ్యవసాయ సలహా మండలి సమావేశం లో రాష్ట్ర కమిటీకి నివేదిక అందజేస్తామని జిల్లా కలెక్టరు పి రంజిత్ బాషా అన్నారు.
జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు జన్ను రాఘవరావు మాట్లాడుతూ, ఈ క్రాప్ నమోదు చేసేందుకు సీ సీ ఆర్ సి కార్డ్ లేకపోయినా కల్టివేటర్ గా నమోదు చేయాలని కోరారు. వ్యవసాయ యాంత్రికరణలో వ్యక్తిగతంగా స్ప్రేయర్లు, టార్పలిన్లు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇప్పించాలని కోరారు. అవసరం మేరకు మాత్రమే ఏ యం సి యు లు పంచాయతీలకు ఇప్పించాలని కోరారు. ఖరీఫ్ 2021-22 ఇన్సూరెన్స్ బకాయిలు త్వరగా రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. మురుగు కాలువల్లో పూడికతీత మరియు తూడు తొలగింపు పనులను త్వరితగతిన చేయాలని అన్నారు. వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్న మోటార్లకు కరెంటు మీటర్లు పెట్టడం రైతులకు ఇబ్బందిగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.జిల్లాలో వివిధ మండలాల్లో ఉన్న సమస్యలను , సూచనలను ఈ సమావేశంలో ఛైర్మన్ జన్ను రాఘవరావు రావు వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ఉద్యానవన శాఖ 2023 డైరీని ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండల సమావేశంలో సభ్యులు కె. రామచంద్ర రావు, శ్రీకాకుళం నాగేశ్వరరావు ( బాబు), పి. ప్రభాకర్ రావు, విచారపు ఆదినారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మనోహరరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్. శ్రీనివాసరావు ఉద్యానవన, వ్యవసాయశాఖ శాస్త్ర వేత్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News