విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విభజన తరువాత సంక్షోభం లో ఉన్న రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ చేతిలో పెడితే ఇచ్చిన హామీలను విస్మరించి వారు ప్రజలను మోసం చేసారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. యువ గళం అంటూ జనాల్లోకి వెళ్తున్న టీడీపీ నాయకుడు నారా లోకేష్ 2014 ఎన్నికల సమయంలో వారు ఇచ్చిన హామీలు ఎన్ని అధికారంలోకి వచ్చిన ఐదేళ్ళ కాలంలో ఎన్ని హామీలు నెరవేర్చరో ప్రజలకు చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసినందుకు ముందుగా వారికి క్షమాపణలు చెప్పి తర్వాత పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి లంచాలకు తావులేకుండా నేరుగా గడప వద్దకే సంక్షేమ పథకాలు అందజేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వలంటీర్ వ్యవస్థ ను తీసుకొస్తే నాడు వారిని విమర్శించిన చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు నేడు ఆ ఆలోచనను కాపీ కొడుతూ కుటుంబ సారధులను ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవితం అంతా మరొకరిని కాపీ కొట్టి సొంత ప్రచారం చేసుకోవడం తప్ప ఆయనకు సొంత ఆలోచనలు ఏమి ఉండవని, నాటి స్వర్గీయ వైయస్సార్ అమలు చేసిన పథకాలకు పేరు మార్చి ఆయన పేరు పెట్టుకొన్నాడని, మరలా నేడు జగన్ ని కాపీ కొడుతున్నారు అని ఎద్దేవా చేశారు. మీరెన్ని డ్రామాలు ఆడిన ప్రజల మద్దతు తో మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. విజయవాడ నగరంలో రాజకీయాలకు అతీతంగా విద్య, ఉపాధి, వైద్య సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండగా నిలుస్తున్నామని ట్రస్ట్ ఛైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ కు చెందిన 6 నిరుపేద కుటుంబాలకు దాదాపు 1లక్ష 50వేలు రూపాయలతో జీవనోపాధి నిమిత్తం 2 ఇస్త్రీ బండ్లు,2 తోపుడు బండ్లు, 1 బడ్డీ కొట్టు, 1 టిఫిన్ బండి ని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్ లో నివసించే వీరు అద్దె బండ్లుతో ఇబ్బందులు పడుతున్నామని తమకు జీవనోపాధి కి సహాయం చేయాలని స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ తాటిపార్తి కొండారెడ్డి ని కోరగా ఆయన తక్షణమే ఆ విషయం మా దృష్టికి తీసుకురాగా నేడు వారికి దాదాపు 1లక్ష 50వేల రూపాయల విలువ గల బండ్లు ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగిందని అన్నారు. నిరుపేదలకు అండగా నిలిచిన దేవినేని నెహ్రూ మరణించిన నాటి నుండి కూడా ఆయన ఆశయసాధనకు కృషి చేస్తూ ట్రస్ట్ ద్వారా పార్టీలకతీతంగా అవసరమైన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా ట్రస్ట్ కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండా రెడ్డి వైస్సార్సీపీ నాయకులు జోగారాజు, శ్రీనివాసరెడ్డి, పులి రమణారెడ్డి, అంజిరెడ్డి, ఫజులుద్దున్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News