విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం, వినియోగదారులకు తాజా ఉత్పత్తులను అందించి మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్. డిల్లీరావు అన్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకంలో బాగంగా జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 20 లక్షల రూపాయల విలువైన లైవ్ ఫిష్ వెహికల్ వాహనాన్ని రాయన పాడుకు చెందిన మల్లాది మల్లేశ్వరికి కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్ ఢిల్లీరావు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మత్స్య కారులు, మత్స్య కార సంఘాలు, మత్స్య సంపదను విక్రయించుకునేందుకు మొబైల్ వాహనాలు ఉపయోగపడతాయన్నారు. మత్స్య కారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. దీనిలో భాగంగా మత్స్య కారులు బహిరంగ మార్కెట్లో మొబైల్ వాహనాల ద్వారా తాజా మత్స్య ఉత్పత్తులను విక్రయించుకుని ఆర్థిక పరిపుష్టిని సాధించాలని లక్ష్యంతో సబ్బిడీపై మొబైల్ వాహనాలను మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం మత్స్య కారుల సంక్షేమానికి 60శాతం సబ్సిడీ పై అందిస్తున్న వాహనాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
కార్యక్రమంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ. నాగరాజా, మత్స్య సంఘాల డైరెక్టర్ ఎన్. కాళీకారావు, ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారులు పి. అఖిల, కె. నాగభద్రరావు ఉన్నారు.
Prajavartha Online Telugu News