-మహా శివరాత్రిని పురస్కరించుకుని కాశీ విశ్వేశ్వరునికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరమశివునికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రిని పురస్కరించుకుని శనివారం శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గవర్నర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో నిర్వహించిన సర్వదేవతా హోమాలు, పూర్ణాహుతిలో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని విఘ్నాధిపతికి ఆది పూజ నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రముఖ శైవక్షేత్రాల వద్ద దేవాదాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. సృష్టి లయకారుడైన శివయ్యను సర్వేశ్వరుడిగా, విశ్వేశ్వరుడిగా, అర్థనారీశ్వరుడిగా.. భక్తి ప్రపత్తులతో ప్రజలు కొలుస్తారని పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన నిర్వహించే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శుభ ఫలితాలను ఇస్తుందని వెల్లడించారు. శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉందని.. జాగారం సమయంలో శివపంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఈ పర్వదినం రోజున కలిగినంతలో దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయన్నారు. ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. తదనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు పలికి పరమశివుని తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో సాంబశివరావు, డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, నాడార్స్ శ్రీను, నళిని, వడ్డే వాసు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News