-కాల్వలకు నీటి విడుదల సమస్యలను పరిష్కరించి చివరి భూముల వరకు అందించేందుకు చర్యలు..
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌ఎస్‌పి కాల్వల ద్వారా జిల్లా రైతాంగానికి సాగునీటిని విడుదల చేయడంలో ఎదురవుతున్న సమస్యలను ప్రజా ప్రతినిధుల సహకారంతో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు తెలిపారు.
ఎన్‌ఎస్‌పి కాల్వల ద్వారా నీటి విడుదల సమస్యపై సోమవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, శాసనసభ్యులు ఎన్‌ఎస్‌పి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్‌ఎస్‌పి కెనాల్ ద్వారా 3,67,220 ఎకరాల అయికట్టుకు సాగు నీటిని అందించేలా పులిచింతల ప్రాజెక్టు నుండి ఎన్‌ఎస్‌పి కాల్వల ద్వారా 32.25 టియంసిల నీటిని కేటాయించడం జరిగిందన్నారు. ఎన్‌ఎస్‌పి కల్వల ద్వారా తిరువూరు, మైలవరం, నూజివీడు, నందిగామ, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో అయికట్టుకు ఈ ఏడాది రబీ సీజన్‌కి 19.25 టియంసిలు నీటిని కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 9.52 టియంసిలను నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. ఇంకనూ 9.73 టియంసిల మిగుల నీటిని విడుదల చేయవలసి వుందని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
మైలవరం శాసనసభ్యులు వంసత కృష్ణప్రసాద్ మట్లాడుతూ తెలంగాణ అధికారులు సకాలంలో విడుదల చేయవలసిన నీటిని విడుదల చేయకపోవడం వలన రైతాంగం ఇబ్బందులు పడుతున్నారన్నారు. విడుదల చేయవలసిన నీటిని రైతాంగానికి అవసరమైన సమయంలో విడుదల చేయడంలేదన్నారు. వారాబంది నిబంధలన ప్రకారం నీటిని విడుదల చేయవలసి ఉన్నప్పటికి కేవలం 200 నుండి 500 క్యూసెకుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారని, ఆ నీటిని కూడా నిరంతరాయంగా విడుదల చేయని కారణంగా విడుదల చేసిన నీరు ఆవిరవడం, భూమిలో ఇంకిపోవడం వలన చివరి భూములకు నీరు అందడం లేదని శాసనసభ్యులు సమావేశ దృష్టికి తీసుకువచ్చారు. నిరంతరాయంగా నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవల్సిన భాధ్యత ఎన్‌ఎస్‌పి అధికారులపై ఉందన్నారు. విటిపిఎస్ బ్యాక్ వాటర్‌ను రైతులకు అందించేందుకు తారకరామ ఎత్తిపోతల పథకం పంపిగ్ స్కీమ్‌లో మోటార్లకు చేసిన మరమ్మతుల బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
జగ్గయ్యపేట శాసన సభ్యులు సామినేని ఉదయభాను మట్లాడుతూ తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం మెట్ట ప్రాంతాల రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. తెలంగాణ అధికారులు ఎన్‌ఎస్‌పి కాల్వలకు నీటిని విడుదల చేయడంలో ప్రదర్శిస్తున్న వైఖరిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం వుందన్నారు. రబీ పంటకు ప్రతి రోజు విడుదల చేయవల్సిన నీటిలో కనీసం 50 శాతం నీటిని కూడా విడుదల చేయకపోవడంతో దామాష ప్రకారం అన్ని ప్రాంత రైతులకు న్యాయం జరగటం లేదన్నారు.
నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ తన నియోజకవర్గం ఎన్‌ఎస్‌పి కాల్వల కింద చిట్ట చివరిలో ఉందని సాగు నీరు అందక తమ ప్రాంత రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కాల్వల పర్యవేక్షణకు లస్కర్ల సమస్య ఉందని కమాండ్ ఏరియా డెవలంప్‌మెంట్ అథారిటీ వద్ద నిధులు ఉన్నాయని వాటి నుండి కొంత మొత్తాన్ని లస్కర్ల జీతభత్యాలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
శాసనసభ్యుల సూచనల పై జిల్లా కలెక్టర్ డిల్లీరావు స్పందిస్తూ సమస్యను ఇరు రాష్ట్రాల మంత్రులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌ఎస్‌పి అధికారులు తెలంగాణ ఎన్‌ఎస్‌పి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నీటి విడుదలలో జాప్యాన్ని నివారించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యను వెంటనే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రికి వివరించి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. లస్కర్ల జీతభత్యాలకు నిధులు మంజూరు చేసేలా కమాండ్ ఏరియా డెవలంప్‌మెంట్ అథారిటీ కమీషనర్‌తో సంప్రదిస్తానన్నారు.
సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఇ తిరుమలరావు, ఎన్‌ఎస్‌పి ఎస్‌ఇ శ్రీరామకృష్ణ, ఇఇలు ఆర్ అప్పారావు, శ్రీనివాసన్, డిఇలు బి బావసింగ్, రాంబాబు, శ్రీనివాత్సవ, జెఇలు సుధారాణి, హిమబిందు, రైతు నాయులు గుంటుపల్లి వాసు, చిరుమామిళ్ల అశోక్, అప్పిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News