-అధికారిక వీడ్కోలు సభలో రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-రాజ్యాంగ వ్యవస్ధల మధ్య సమన్వయం ఎలా ఉండాలన్నదానిని హరిచందన్ చూపారు
-రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ తనకు రెండో ఇల్లు వంటిదని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనను కుటుంబ సభ్యుడిలా అభిమానించారని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్ర ప్రజలు తన పట్ల ఎంతో ఆత్మీయతను చూపారన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా బదిలీ అయిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన అధికారిక వీడ్కోలు కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం, రాష్ట ప్రజల పక్షాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. రాష్ట్రాన్ని వీడుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తనకు మరొక టాస్క్ అప్పగించిందని, చత్తీస్ గఢ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించవలసి ఉందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ కు తాను మూడు సంవత్సరాల ఏడు నెలల పాటు గవర్నర్ గా ఉన్నానని, ఇక్కడ సిఎం నేతృత్వంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని పేర్కొన్నారు. జనాభాలో అత్యధిక భాగం అధారపడిన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భరోసా కేంద్రాల పధకం అచరనీయమని, దీనిని గురించి తాను ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వివరించానని చెప్పారు. ఎంతో వ్యయంతో కూడుకున్నప్పటికీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైందని ప్రసంశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ చత్తీస్ గఢ్ గవర్నర్ గా హరిచందన్ వెళ్తున్నందుకు అభినందనలు తెలిఃపారు. గవర్నర్ గా, ఆత్మీయుడైన పెద్దమనిషిగా వ్యవస్థకు బిశ్వభూషణ్ నిండుతనం తెచ్చారన్నారు. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలన్న దానిని ఈ మూడున్నర సంవత్సరాలలో గవర్నర్ ఆచరణలో గొప్పగా చూపించారని కొనియాడారు.
దేశం లోని పలు రాష్ట్రాలలో అయా గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న సంబంధాలపై ఇటీవల పలు రకాల వార్తలు చూస్తున్నామని, కానీ మన రాష్ట్రంలో అందుకు భిన్నంగా తండ్రిలా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కుటుంబ పెద్దలా ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తూ, తనదైన వాత్సల్యం చూపారన్నారు. హరిచందన్ ఉన్నత విద్యావేత్త, న్యాయ నిపుణుడు మాత్రమే కాదని, నాలుగు సార్లు మంత్రిగా పనిచేసి తాను చేపట్టిన ప్రతి శాఖలోనూ తనదైన ముద్ర వేసారన్నారు. 5 సార్లు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారన్నారు. రాష్ట ప్రజల తరపున సిఎం అభినందనలతోపాటు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పలువురు ప్రజా పతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News