గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర ఖ్యాతిని చాటేలా చుట్టగుంట జంక్షన్ అభివృద్ధి చేయనున్నామని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. బుధవారం రూ.2.20 కోట్లతో చుట్టగుంట జంక్షన్ అభివృద్ధికి చేపట్టనున్న పనులకు ఎం.ఎల్.సి. లేళ్ళ అప్పిరెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, ఎం.ఎల్.ఏ. మద్దాలి గిరిధర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నంలతో కలిసి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వై.సి.పి. పాలకవర్గం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి పనులను పార్టీలకు అతీతంగా చేపడుతున్నామన్నారు. ఇప్పటికే నగరంలో ప్రధాన జంక్షన్ల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు.
ఎం.ఎల్.సి. అప్పిరెడ్డి మాట్లాడుతూ నగర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. గుంటూరు నగరంలోకి వచ్చే ప్రధాన జంక్షన్ చుట్టగుంట కాబట్టి అందుకు తగిన విధంగా అభివృద్ధి మోడల్ ఉండాలన్నారు. జంక్షన్ తో పాటు పక్కన ఉన్న వాకింగ్ ట్రాక్, చెరువుని కూడా అభివృద్ధి చేయాలన్నారు.
ఎం.ఎల్.ఏ. గిరిధర్ మాట్లాడుతూ నగరంలో విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, చుట్టగుంట జంక్షన్ అభివృద్ధిని రోల్ మోడల్ గా చేపట్టాలన్నారు. ఏ.టి. అగ్రహారం రోడ్ విస్తరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. టెండర్ పొందిన కాంట్రాక్టర్ లు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ నగరంలో పార్క్ లు, జంక్షన్లను అధిక ప్రాధాన్యతగా అభివృద్ధి చేస్తున్నామని, గాంధీ పార్క్ ను కూడా వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. చుట్టగుంట జంక్షన్ ని కూడా గుంటూరు వారసత్వాన్ని చాటేలా డిజైన్ లు తయారు చేస్తున్నామని తెలిపారు. డిజైన్లు ఫైనల్ చేశాక పనులు వేగంగా చేపట్టడానికి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ ప్రకారం చేస్తారన్నారు.
మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏసురత్నం మాట్లాడుతూ నగర సుందరీకరణకు పాలకవర్గం, అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారని, త్వరలో గుంటూరు నగరం రాష్రంస్లోనే మోడల్ నగరంగా మారనున్నదన్నారు. ముఖ్యమంత్రి కూడా నగర అభివృద్ధి పై దృష్టి సారిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, కార్పొరేటర్లు అడకా పద్మావతి, షేక్ రోషన్, అచ్చాల వెంకట రెడ్డి, కాండ్రగుంట గురవయ్య, అందుగుల సంతోష్, నగరపాలకసంస్థ ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ. సుందర్రామిరెడ్డి, డి.ఈ.ఈ. రమేష్ బాబు, ఏఈ నాగవేణి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News