-78 ఏళ్ళ వయస్సులో పతకాల పంట పండిస్తున్న మల్లికార్జునరావు..
-క్రీడకారులకు మల్లికార్జునరావు స్పూర్తి దాయకం.
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
78 ఏళ్ళ వయస్సులో నడక పరుగు పోటీలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నకనగాల మల్లికార్జునరావు నేటి యువతకు స్పూర్తి దాయకంగా నిలుస్థారని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. కలకత్తా లో నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ 2023 పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన నగరంలోని టీచర్స్ కాలనికి చెందిన కనగాల మల్లికార్జునరావును బుధవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 78 ఏళ్ళ వయస్సులో నడక పరుగు పోటీలలో యువకులతో సమానంగా పతకాలను సాధించడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఇటీవల కలకత్తాలోని వివేకనంద యువ భారతి కిరంగన్ అండ్ సాయి స్పోర్ట్ కాంప్లెక్స్ నందు ఈ నెల 14వ తేది నుంచి 18వ తేది వరకు నిర్వహించిన జాతీయ స్థాయి నడక పరుగు పోటీలలో మల్లికార్జునరావు 21 కిలో మీటర్ల పరుగును 2 గంటలలో పూర్తి చేసి రికార్డు సృష్టించి చాంపియన్ షిప్ ను సాధించడంతో పాటు 3 గోల్డ్ మెడల్స్ ను సాధించి రాష్ట్రానికి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన వివిధ పోటీలలో 21 కిలో మీటర్ల పరుగులో 16 పతకాలు, 5 కిలో మీటర్ల పరుగులో 16 పతకాలను సాధించిన మల్లికార్జునరావు నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు.
విజేత కనగాల మల్లికార్జునరావు మాట్లాడుతూ చిన్నతనం నుండి తనకు వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండేదని ఉదయాన్నే వ్యాయామాన్ని ముగించుకొని వ్యవసాయ పనుల్లో పాల్గొనేవాడినని తెలిపారు. కో`ఆపరేటివ్ సొసైటి లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసానన్నారు. ఇప్పటివరకు ప్రతి నిత్యం వేకువజామునే నడక పరుగు వంటి వ్యాయామ కార్యక్రమాలలో పాల్గొంటున్నానని తెలిపారు. జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలలో నిర్వహించే పోటీలలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News