-పోలీస్ అధికారులకు ఫోక్సొ, జువెనైల్ చట్టాలపై శిక్షణ తరగతులు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బాల బాలికలపై అకృత్యాల రక్షణ చట్టం, జువైనల్ జస్టిస్, కేర్, ప్రొటెక్షన్ 2015 యాక్ట్ పై నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్ ఇచ్చే శిక్షణపై పూర్తి స్ధాయి అవగాహన పెంపొందించుకొని పోలీసులు తమ దైనందిన విధి నిర్వహణలో బాలల పరిరక్షణకై పాటుపడాలని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ చైర్ పర్సన్, జిల్లా జడ్జి అరుణ సారిక ఆదేశించారు.
జిల్లా పోలీస్ ఆఫీస్ మచిలీపట్నంలోని స్పందన కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఉదయం కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి ఎల్ ఎస్ ఏ చైర్ పర్సన్, జిల్లా జడ్జి అరుణ సారిక పలువురు శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
నేటి బాలలే రేపటి పౌరులు అనేది పాత నానుడని, నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అనేది నూతన ఒరబడి అని తొలుత అందరూ గ్రహించాలన్నారు. దేశ భవిష్యత్తును సంరక్షించుకోవాలంటే ఉన్నతమైన ఆశయాలు కలిగిన బాల బాలికలను వారి బాల్యం నుంచే తీర్చేదిద్దడం అవసరమన్నారు. మన దేశ జనాభాలో దాదాపు 25 శాతం మంది చిన్నారులే ఉన్నారన్నారు. మన ముందు తరం వారు బాలలు వారి పరిరక్షణ, అక్షరాస్యత తదితర విషయాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగం ద్వారా బాల బాలికల ప్రయోజనాల కొరకు ఆర్టికల్ 15, 20, 21(ఏ), 23 (1), 24, 29 ల ద్వారా బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య, వారి ఆరోగ్య పరిరక్షణ, మానవ అక్రమ రవాణా నిషేధం తదితర అంశాల మీద కృషి చేశారన్నారు. ఇవే రాజ్యాంగ సూత్రాలను అనుసరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలను సైతం రూపొందించారన్నారు.
వాటిలో ముఖ్యంగా బాల కార్మిక నిర్మూలన చట్టం, బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య, వెట్టి చాకిరి నిర్మూలన చట్టం, చిన్నారులపై అకృత్యాల రక్షణ చట్టం (ఫోక్సో యాక్ట్), జువెనైల్ జస్టిస్ కేర్, ప్రొటెక్షన్ యాక్ట్ 2015 ఎంతో కీలకమైన చట్టాలని అన్నారు. ఈ రెండు చట్టాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ప్రాముఖ్యమైన సంగతని అన్నారు.
మానవ అక్రమ రవాణా నిషేధిత చట్టం తీసుకురావడం ద్వారా బాల బాలికల సంక్షేమమే పరమావధిగా గౌరవ సుప్రీంకోర్టు సంపూర్ణ బెహ్లావ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ జిల్లా, గ్రామస్థాయిలో ఏర్పాటు చేయవలసిందిగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగిందన్నారు. తడనుగుణంగా స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్లు ( ఎస్ జె పి యు ) సంబంధించి శిక్షణా తరగతులు తరచుగా నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచన చేసిందని ఆ మేరకు పోలీస్ అధికారులకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్స్ తెలియజేసే ఆయా అంశాలపై పరిజ్ఞానం విస్తృతంగా పెంపొందించుకొని విధి నిర్వహణలో బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడాలని, జువెనల్ జస్టిస్ చట్టంపై పునశ్చరణను శిక్షణా కార్యక్రమంలో బాలల సంబంధిత చట్టాలతో పాటు జువెనైల్ జస్టిస్ చట్టం కింద వారు పోషించవలసిన భూమిక, బాధ్యతలపై శిక్షణ పొందుతారని జిల్లా జడ్జి పేర్కొన్నారు.
అనంతరం హెల్ప్ ఎన్జీవో కార్యదర్శి ఎన్ వి ఎస్ రామ్మోహన్ న్యాయశాస్త్రం. బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి సూచనలు జువెనైల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ కోసం యునైటెడ్ నేషన్స్ స్టాండర్డ్ మినిమమ్ రూల్స్ (ది బీజింగ్ రూల్స్) 1985 గూర్చి. బాల్య నేరాల నివారణకు ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలు (రియాద్ మార్గదర్శకాలు), 1990 శిక్షణ కార్యక్రమంలో వివరించారు. తర్వాత చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు చీలి ముసలయ్య జువెనల్ జస్టిస్ యాక్ట్ 2015 రూల్స్ గురించి వివరించారు. తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ కె. సువార్త బాలల సంక్షేమం ఉత్పన్నమయ్య సమస్యలు గూర్చి వివరించారు. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి వి వరదరాజులు భారతీయ శిక్షాస్మృతి గూర్చి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రిలేటింగ్ చిల్డ్రన్ విట్నెస్ పై ప్రసంగించారు.
సాయంత్రం మూడున్నర గంటల సమయంలో ‘ ఏక్తా బచపన్ ‘ అనే వీడియో చిత్రాన్ని ప్రదర్శించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ వి రామాంజనేయులు, డిప్యూటీ ఎస్పీ మాసుం బాషా, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి ఎస్ ఆర్ కె ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News