-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 259 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాభీష్టం నెరవేర్చడమే ప్రథమ కర్తవ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం 58 వ డివిజన్ 259 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నూకాలమ్మ గుడి వద్ద నుండి ప్రారంభించిన కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, అధికారులతో కలిసి మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తాము సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేర్చినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రతి గడపకు వెళ్లి, ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ.. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆరా తీయడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవడమే అజెండాగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీసిన ఆయన.. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు.
సచివాలయ పరిధిలో రూ. 4.25 కోట్ల సంక్షేమం
నవరత్నాల పథకాల ద్వారా 259 వ వార్డు సచివాలయ పరిధిలో 4.25 కోట్ల సంక్షేమాన్ని మూడున్నరేళ్లలో అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 195 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 282 మందికి రూ. 36.66 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 139 మందికి రూ. 30.51 లక్షలు., చేయూత ద్వారా 97 మందికి రూ. 18.18 లక్షలు., కాపు నేస్తం ద్వారా 39 మందికి రూ. 5.85 లక్షలు., వాహనమిత్ర ద్వారా 26 మందికి రూ. 2.60 లక్షలు., జగనన్న తోడు ద్వారా 32 మందికి రూ. 3.20 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి నారా లోకేష్ తంటాలు
ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతలు నిర్వర్తించడంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైందని మల్లాది విష్ణు విమర్శించారు. పాలకపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ప్రజాస్వామ్య పంథాలో పోటీపడలేక.. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వాన్ని అర్థరహితంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని పదే పదే చెప్పుకునే చంద్రబాబు సైతం తన అనుభవాన్ని విస్మరించి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తండ్రి దారిలోనే లోకేష్ పయనిస్తూ… సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ పైనా ఆయన వాడుతున్న భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. దేశంలోనే డైనమిక్ ముఖ్యమంత్రిగా పేరుపొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని నారా లోకేష్ ను చూసి భయపడుతున్నారని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదన్న నిరాశలో ఏం మాట్లాడుతున్నారో కూడా లోకేష్ కు అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో అన్ని రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటుంటే చూసి తండ్రికొడుకులకు పిచ్చి పడుతోందని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ లు ఎన్ని కుట్రలు చేసినా.. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ ను ఢీకొనలేరని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, హఫీజుల్లా, తోపుల వరలక్ష్మి, వసంత్, అశోక్, యాకోబు, గోపిరెడ్డి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News