విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువ బ్యాంకు ఉద్యోగుల ద్వితీయసమ్మేళనం స్థానిక ‘‘ఏ’’ కన్వెన్షన్ సెంటర్ నందు పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుండి దాదాపు 1500 మంది యువ బ్యాంకు ఉద్యోగులు వివిధ బ్యాంకులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉత్సాహంగా సమ్మేళనంలో పాల్గొన్నారు.సమావేశాల ప్రారంభ సూచికగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షులు టి. రవీంద్రనాధ్,ఎ.ఐ.బి.ఇ.ఎ యూనియన్ పతాకాన్ని ఎగురవేసి సభ్యుల కరతాల ధ్వనుల మధ్య సమావేశాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం, బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్ళను, పోరాటాల ద్వారా ఎదుర్కోవాలని, గతంలో బ్యాంకు ఉద్యోగుల నాయకులు కామ్రేడ్ ప్రభాత్కర్, కామ్రేడ్ పర్వాన, కామ్రేడ్ తారకేశ్వర్ చక్రవర్తి, కామ్రేడ్ సుందర్రావు, కామ్రేడ్ వివేకానంద రావులు చేసిన పోరాటాలు, త్యాగాలు స్ఫూర్తితో మన పోరాటాలను మరింత పటిష్టంగా నిర్మించాలని కోరారు. సమావేశాలను ప్రారంభిస్తూ ఎ.ఐ.బి.ఇ.ఎ ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటాచలం యువ బ్యాంకు ఉద్యోగుల సమ్మేళనం నిర్వహించవలసిన ఆవశ్యకతను వివరించారు. యువ బ్యాంకు ఉద్యోగులు బ్యాంక్ ట్రేడ్ యూనియన్ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పనిచేయాలని ఉద్బోధించారు. బ్యాంకు ఉద్యోగుల ఐక్యత, పోరాటాలలో వారి భాగస్వామ్యం గత 77 సంవత్సరాలుగా ఎ.ఐ.బి.ఇ.ఎ విజయానికి దోహదం చేశాయని తెలియజేశారు. ఎ.పి.టి.బి.ఇ.యఫ్ ప్రధాన కార్యదర్శి బి.యస్.రాంబాబు మాట్లాడుతూ పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల నుండి తరలివచ్చిన యువ బ్యాంకు ఉద్యోగులను అభినందించారు. ఇటీవల బ్యాంకుల ప్రైవేటీకరణకు, కార్పొరేట్ రంగం బుద్ధిపూర్వకంగా ఋణాల ఎగవేతకు, వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేసిన పోరాటాలలో యువ బ్యాంకు ఉద్యోగులు పోషించిన చురుకైన పాత్రను అభినందించారు.ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద పరిశ్రామిక వేత్త ఆదానీ సంస్థలకు బ్యాంకులు అందజేసిన ఋణాల వివరాలు తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ వివిధ బ్యాంకులను కోరిందని, తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ఎన్నో వేల కోట్ల ఋణాలు ఆదానీ సంస్థలకు బ్యాంకులు అందజేశాయని, ఈ సంస్థల వాటాలు షేర్ మార్కెట్లో కుప్పకూలుతున్న నేపథ్యంలో రిజరా బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో నిష్పక్షపాతంగా విచారణ చేసి 100% బ్యాంకు ఋణాలు వసూలు చేసి, బ్యాంకులు, తద్వారా ప్రజలు నష్టపోకుండా చూడాలని కోరారు.సిబిఐ మాజీ సంయుక్త డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, యువ బ్యాంకు ఉద్యోగులను పోరాటాలకు సిద్ధం చేసే చక్కటి యువ సమ్మేళనం నిర్వహిస్తున్న ఎ.పి.టి.బి.ఇ.యఫ్ నాయకత్వాన్ని అభినందించారు. అవినీతికి వ్యతిరేకంగా వివిధ సందర్భాల్లో ఏ.ఐ.బి.ఇ.ఎ చేసిన పోరాటాలను ఆయన అభినందించారు. దేశంలో అవినీతి లేని రంగం ఏదైనా ఉంది అంటే అది బ్యాంకింగ్ రంగం మాత్రమే అని దానిలో కూడా కింది స్థాయిలో ఉద్యోగులు అధికారులే అని కొనియాడారు. దేశంలో అవినీతి నిర్మూలనకు చేసే పోరాటాలలో బ్యాంకు ఉద్యోగులు ముఖ్యంగా యువ బ్యాంకు ఉద్యోగులు ముందుండాలని కోరారు. రైతు మరణాలు లేని దేశంగా మన భారతదేశాన్ని నిర్మించాల్సిన బాధ్యత యువ బ్యాంకు ఉద్యోగులపై ఉందని ఎ.ఐ.టి.యు.సి ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, కార్మిక విధానాలు, పారిశ్రామిక విధానాలు దేశానికి ప్రయోజనకరంగా లేవని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నారని, బి.ఎస్.ఎన్.ఎల్ ను నిర్వీర్యం చేశారని, నష్టాలు వస్తున్నాయని ఎయిర్ ఇండియాను టాటా వారికి కారు చౌకగా విక్రయించారని, ఇప్పుడు ఎయిర్ ఇండియా 540 విమానాల కొనుగోలుకు పూనుకుందని. లాభాల బాటలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కార్మికులు, ప్రజలు, గత సంవత్సరం పైగా పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, బ్యాంకు ఉద్యోగులు ఏ.ఐ.బి.ఇ.ఎ ఆధ్వర్యంలో చేసిన పోరాటాలు ఫలితంగానే బ్యాంకులు ప్రైవేటీకరణ పై కేంద్రం వెనుకకు తగ్గిందని, అప్రమత్తంగా ఉంటూ పోరాటాల ద్వారానే ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను బ్యాంకు ఉద్యోగులు తిప్పికొట్టాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థల, బ్యాంకుల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసే పోరాటానికి ఎ.ఐ.టి.యు.సి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. నాగపూర్ లోని ధరం పీట్ సైన్స్ కాలేజీ విభాగాధిపతి డాక్టర్. యుగళ్ రాయులు మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగులను సంఘటిత పరచటంలో, జాతీయం చేయబడిన బ్యాంకింగ్ రంగాన్ని రక్షించడంలో మరియు బ్యాంకుల ప్రయోజనాలు పరిరక్షించడంలో, తీవ్ర పోరాటం చేయుటలో గొప్ప సాంప్రదాయం కలిగిన ఏ.ఐ. బి.ఇ.ఎ బ్యానర్ కింద తగిన దిశానిర్దేశం చేయుట ద్వారా బ్యాంకు యువతను మరింతగా ప్రోత్సహించాలని కోరారు. పెట్టుబడిదారులు దాడిని, ఆర్థిక సంస్థలను కబలించాలనే రాబందుల దాడులను ఎదుర్కోవటంలో మనకు ఖచ్చితమైన పాత్ర ఉందని సూచించారు. రైతు ఉద్యమ నాయకులు సుఖదేవ్ సింగ్ మాట్లాడుతూ బ్యాంకుల జాతీయకరణ కొరకు పోరాటం చేయుటమే కాక, రైతులకు తక్కువ వడ్డీకి తగినంత ఋణాలు అందజేయాలని, కౌలు రైతులకు కూడా తగినంత ఋణ సహాయం చేయాలని ఏ.ఐ.బి.ఇ.ఎ చేసిన పోరాటాల కారణంగా బ్యాంకులు రైతులకు పెద్దఎత్తున సరసమైన వడ్డీకి ఋణాలు అందజేస్తున్నాయని, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో కనీస సౌకర్యాలు లేకపోయినా ఖాదారులకు సేవ చేయడానికి బ్యాంకు ఉద్యోగులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారని బ్యాంకు ఉద్యోగులను అభినందించారు. సెప్టెంబర్ 2020లో పార్లమెంట్ ఆమోదించిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢల్లీి శివార్లలో వేలాది రైతులు సంవత్సరం పైబడిన చేసిన పోరాటానికి ఏ.ఐ.బి.ఇ.ఎ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగుల మద్దతు మరుపురానిదని తెలియజేశారు. రైతులు ఆందోళనకు, ప్రజల మద్దతు కారణంగా వెనుకకు తగ్గిన ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను రద్దు చేసినప్పటకీ, రైతులు కోరిన అన్ని పంటలకు కనీసం మద్దతు ధర హామీతో సహా ఇతర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని, రైతుల ఆపరిష్కృత సమస్యలపై మరొక విడత పోరాటానికి రైతులు సమయత్తమవుతున్నారని, ఈ పోరాటానికి బ్యాంకు ఉద్యోగుల మద్దతు కోరారు. సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.హెచ్. దివాకర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న 44 కేంద్ర కార్మిక చట్టాలకు బదులుగా నాలుగు లేబర్ కోడ్లను రూపొందించింది అని, అవి వేతనాలపై కోడ్, పారిశ్రామిక సంబంధాలు కోడ్, సామాజిక భద్రతపై కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ 2020. ఈ కోడ్లను అధికార గెజిట్లో కూడా ప్రచురించడం జరిగిందని, కార్మికులు ఎన్నో దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎన్నో చట్టాలను నిర్వీర్యం చేశారని. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం యావత్తు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఎ.పి.టి.బి.ఇ.యఫ్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పి.ఉదయభాస్కర్ వందన సమర్పణతో సమావేశాలు ముగిశాయి.
Prajavartha Online Telugu News