-ఖాతాదారుల ముంగిటే పరిష్కార వేదిక
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లాల్లో జిల్లా ఔత్సాహిక కార్యక్రమం లో భాగంగా “నిధి ఆప్ కే నికాత్ 2.0” ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. ఇకపై ప్రతి నెలా 27 వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఒక వేళ ఆరోజు ప్రభుత్వ సెలవు ఐతే తరువాత కార్యాలయం పనిచేసే రోజున నిర్వహిస్తారని తెలిపారు.
సోమవారం స్థానిక మోరంపూడి ఈ పి ఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో “నిధి ఆప్కే నికాత్ 2.0 ” డిస్ట్రిక్ట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ అమలు పై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ మాధవీలత పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పునరుద్ధరించిన “నిధి ఆప్కే నికాత్ ” ప్రోగ్రామ్ ద్వారా దేశంలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున జిల్లా స్థాయి లో ఔత్సాహిక ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఈపిఎఫ్ ఖాతాదారుల ఇంటి ముంగిటే సేవలు అందించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
నిధి ఆప్కే నికాత్ 2.0 అనేది యజమానులు మరియు ఉద్యోగులకు ఫిర్యాదుల పరిష్కార వేదిక మరియు సమాచార మార్పిడి నెట్‌వర్క్ మాత్రమే కాకుండా వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమాచార మార్పిడికి వేదికగా కూడా ఉంటుందని ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్ క్లెయిమ్ ఫైల్ చేయడం వంటి ఆన్‌లైన్ సేవలను సభ్యులు పొందే హెల్ప్ డెస్క్ ఉంటుందని, సభ్యుల ఫిర్యాదుల పరిష్కారం అక్కడికక్కడే నమోదు చేయబడుతుందని అన్నారు. ఏదైనా ఫిర్యాదును అక్కడికక్కడే పరిష్కరించలేకపోతే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు ఉంటాయాన్నారు. ఈ పి ఎఫ్ ఓ యొక్క ఫిర్యాదుల పోర్టల్‌లో నమోదు చేయబడినవారిని ప్రాధాన్యతపై పరిష్కరించబడుతుందన్నారు.
నిధి ఆప్కే నికాత్ అనేది ఈ పి ఎఫ్ ఓ వాటాదారులు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ పి ఎఫ్ ఓ ఫీల్డ్ ఆఫీస్‌లకు వచ్చే కార్యక్రమం, నిధి ఆప్ కే నిఖత్ 2.0 కింద వాటాదారులను చేరుకుంటుందన్నారు. ప్రతి నెలా ఒకే రోజు దేశంలోని అన్ని జిల్లాలకు చేరుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని, సంస్థలు, సంస్థ యాజమాన్యాలు, ఉద్యోగులు, పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా సోమవారం దేశ వ్యాప్త కార్యక్రమాన్ని న్యూ ఢిల్లీ లో ఆన్లైన్ ద్వారా ఈ-లాంచ్ చేశారన్నారు.
Prajavartha Online Telugu News