విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గడపగడపలో సంతోషాల హరివిల్లు కురుస్తుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 18వ డివిజన్, 84వ సచివాలయం పరిధిలో రాణిగారితోట వినాయకుడి గుడి నుండి మొదలై మాదంశెట్టి సీతారవమ్మా స్ట్రీట్ ప్రాంతాలలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అన్ని కూడా అమలు చేస్తూ కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఇంకా ఎవరికైనా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందకపోతే వారికి కూడా అందించాలనే లక్ష్యంగా ఈ గడపగడప కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఇంటింటికి వెళ్తుంటే మహిళలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు అంటేనే ప్రభుత్వం మీద వారికున్న నమ్మకం అర్థం అవుతుంది అని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో చెప్పిన విధంగా రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కష్టాలు తీర్చారని తెలిపారు. ఈ నిర్మాణం వల్ల ఇళ్ళు తొలగించిన వారికి ఉచితంగా అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్ళు నిర్మించి ఇచ్చారని తెలిపారు. ఒక పక్క ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దదిగా చూపిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు దమ్ము ఉంటే వాళ్ళు అధికారంలో ఉన్న ఐదేళ్లు నియోజకవర్గ అభివృద్ధి కి ఏమి చేశారో కరపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు వద్ద ఫోటోలు దిగి అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొంటున్నారని ఎద్దేవా చేశారు. కేవలం మూడేళ్ళ కాలంలోనే ఈ డివిజన్ లో 18కోట్ల రూపాయల అభివృద్ధి చేశామని మేము ధైర్యంగా చెప్పగలమని ధీమాగా చెప్పారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్, వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News