విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ప్రతి విద్యార్ధి శాస్త్రజ్ఞుడిగా పెంపొందాలి. సామాజిక అభ్యున్నతికి తోడ్పడే విధంగా తయారవ్వాలి. చదువుకున్న రోజుల్లోనే సామాజిక సమస్యల ఎడల అవగాహన పెంచుకోవాలి. వాటికి పరిష్కారాలు ఆలోచించాలి” అని ప్రముఖ వైద్యులు డా॥జి. సమరం పేర్కొన్నారు. గోరా సైన్సు సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటర్నేషనల్ సైన్సు డే సందర్భంగా బెంజిసర్కిల్ సమీపంలోని నాస్తికకేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక్కరోజు సైన్సు ఎగ్జిబిషన్ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ సామాజిక అభ్యున్నతి సైన్సుతోనే ఉందని, నిరంతరం నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉంటేనే సమాజ పురోగతి సాధ్యమవుతుందన్నారు. సభలో మరో అతిధిగా పాల్గొన్న యూనివర్శిటీ ఆఫ్ వెస్టిండీస్ ప్రొఫెసర్ డా॥ ఎస్. హరిహరన్ మాట్లాడుతూ ఈనాడు ప్రపంచమంతా గుప్పిట్లోకి వచ్చేసిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద రివల్యూషన్కి నాంది పలుకుతోందని, క్లిష్టమైనవి కూడా అతి సులవుగా పరిష్కారమయ్యే దిశలో సైన్సు పురోగమిస్తోందని అన్నారు. ప్రతీ విద్యార్ధి తన విద్యార్థి దశలోనే సైన్సు రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు గురించి అవగాహన కలిగించుకోవాలి అన్నారు. ఉరుకులు పరుగులతో పురోగమిస్తున్న సైన్సు ఆవిష్కరణలని అవగాహన చేసుకోకపోతే ఎంత చదువుకున్నవాడైనా, చదువురానివాడిగా భావించే పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రతి విద్యార్ధి శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం పెంచుకుని తన అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడాలని ఆయన అన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఈ సైన్సు ఎగ్జిబిషన్లో 130మంది విద్యార్థులు పాల్గొని 70 ఎగ్జిబిట్స్ని ప్రదర్శించారని గోరా సైన్సు సెంటర్ డైరెక్టర్ నియంత తెలియజేసారు. ఉత్తమ ఎగ్జిబిట్స్కు అవార్డులను అందచేయడమే కాకుండా పాల్గొన్నవారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ను కూడా అందచేసారు. ఇంకా ఈ సభలో డా॥మారు, డా॥ జగతీ గోరా, సురేఖ కూడా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News