పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు నిద్ర లేవకముందే ఇంటి ముందుకు పింఛన్లు అందిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. బుధవారం పెడన పట్టణంలో ఆయన అర్హులైన వారికి స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు. పెడన పట్టణంలోని 11, 12, 13 వార్డుల్లోని 630 మంది లబ్ధిదారులకు ఇంటింటికి తిరిగి పింఛన్లు అందించారు. అనంతరం మంత్రి 4వ సచివాలయ పరిధిలోని 12వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటిని సందర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని కరపత్రాలను అందిస్తూ వార్డు ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలా మొదటి తారీఖు వేకువ జామునే పింఛన్లను ఇంటి ముంగిటకు చేర్చుతూ అవ్వా తాతల కళ్ళలో సంతోషాన్ని నింపుతున్నారని కొనియాడారు. గతంలో పింఛను అందుకోవడానికి వరుసలో నిలబడి వేసారిపోయే రోజులు లేకుండా వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి తలుపులను తట్టి ఉన్న చోటునే చేతికి అందిస్తున్నారని, ఈ తేడాను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. నీకు నెలనెలా పింఛను ఇంటికి ఎవరు పంపిస్తున్నారో తెలుసా అని అంకెం సేవారత్నం అనే వృద్ధురాలికి పింఛను నగదు అందిస్తూ మంత్రి అడగ్గా, నాకు కళ్ళు సరిగా కనిపించకపోయినా అది జగన్ బాబే అని నా మనసుకు తెలుసయ్యా.. నాలాంటోళ్ళందరికీ ఆయనే దేవుడు, ఆయన ఎల్లప్పుడూ చల్లగుండాలి అని చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ సమాధానమిచ్చింది.
ఈ కార్యక్రమంలో పెడన పట్టణ వైయస్సార్ పార్టీ కన్వీనర్ బండారు మల్లికార్జునరావు, వైస్ చైర్మన్ మహమ్మద్ ఖాజా, వార్డు కౌన్సిలర్లు బళ్ళా గంగయ్య, మెట్ల గోపి, జీ.చంద్రబాబు, బాబూలాల్, పెడన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, పెడన తహసీల్దార్ మధుసూధనరావు, పెడన మునిసిపల్ కమీషనర్ ఎం.అంజయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News