Breaking News

శెభాష్ ఏపీఎస్ఈసీఎం!


-ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఇతర రాష్ట్రాలకు చుక్కాని
-‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్’కు జాతీయ స్థాయిలో ప్రశంసలు
-ఏపీలోని ఎస్ఎల్ఎస్సీ నమూనాను 18 రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి
-కేంద్ర ప్రభుత్వ ఈఈ కార్యక్రమాల అమలులో ఏపీఎస్ఈసీఎందే కీలక పాత్ర
-బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే ప్రశంసలు.. సీఈవో చంద్రశేఖర్ రెడ్డికి సన్మానం
-రూ.400 కోట్ల విలువైన 30 ఇంధన సామర్థ్య కార్యక్రమాలను గుర్తించిన బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్
– గడిచిన 3-4 ఏళ్లలో ఏటా రూ.3914 కోట్ల ఇంధన పొదుపు
-రాష్ట్రంలో ఇంకా 11,200 మిలియన్ యూనిట్ల పొదుపుకు అవకాశం
-ఇంధన సామర్థ్య పైనాన్సింగ్ ప్రాజెక్టుల్లో ఏపీ నంబర్ 1
-ఏపీఎస్ఈసీఎం సేవలు నిరుపమానమన్న బీఈఈ
-ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి
-ఇంధన సామర్థ్య కార్యక్రమాల్లో అన్ని శాఖలను భాగస్వాములను చేయాలి
-ఈఈ కార్యక్రమాల అమలును బలోపేతం చేయాలి: సీఈవో చంద్రశేఖర్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. యావత్ దేశం తనవైపు చూసేలా పనిచేస్తోంది. ఇంధన సామర్థ్యం, సంరక్షణతో భారీ స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో వినూత్న ప్రణాళికలతో ముందుకెళుతూ జాతీయ స్థాయిలో ఔరా అనిపించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ‘ఏపీని చూసి నేర్చుకోండి’ అనేలా గుర్తింపు తెచ్చుకుంది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ లో అనుసరిస్తున్న ‘రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ)’కి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ విధానాన్ని 18 రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ప్రకటించింది.
ఇంధన సామర్థ్యం, సంరక్షణ ద్వారా సుస్థిర ఇంధన ఆదా లక్ష్యాలను చేరుకోవడంలో ఎస్ఎల్ఎస్సీ విధానం ఎంతగానో దోహదపడుతుందని బీఈఈ పేర్కొంది. బుధవారం (మార్చి 1) బీఈఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే ఏపీని పొగడ్తలతో ముంచెత్తారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఒడిసా, హరియాణా, బిహార్, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, తెలంగాణ, త్రిపుర సహా 18 రాష్ట్రాలు ఏపీ మోడల్ ఎస్ఎల్ఎస్సీని, కేరళ విధానాలను అనుసరిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో నియమించే కమిటీయే ఎస్ఎల్ఎస్సీ. ఈ కమిటీలను ఏపీ, కేరళలో నియమించారు.
ఇంధన సామర్థ్య చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో అద్భుతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం)’ను బీఈఈ డీజీ అభినందించారు. ఇంధన సామర్థ్యం, సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివిధ పథకాలను సమర్థంగా అమలు చేసినందుకు గాను, వివిధ రంగాలలోని భాగస్వాములలో చైతన్యం తీసుకురావడంలో అత్యంత ప్రతిభ కనబరిచినందుకు గాను ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్ రెడ్డిని బీఈఈ డైరెక్టర్ జనరల్, అభయ్ బక్రే తో పాటు లిబ్బి గ్రీన్, క్లైమేట్ అండ్ ఎనర్జీ లీడ్, బ్రిటిష్ హై కమిషన్, ఎండీ ఈఈఎస్ఎల్ విశాల్ కపూర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బీఈఈ అశోక్ కుమార్ సత్కరించారు.
‘‘ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేయడం వల్లే ఏపీఎస్ఈసీఎం రాష్ట్రపతి చేతుల మీదుగా దేశంలోనే ప్రతిష్ఠాత్మక జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు-2022 అవార్డు, అలాగే ఇతర అవార్డులను గెలుచుకుంది. ఏపీ ప్రభుత్వ సహకారంతో ఏపీఎస్ఈసీఎం ద్వారా బీఈఈ తొలిసారిగా విశాఖపట్నంలో ఇన్వెస్ట్ మెంట్ బజార్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది ఇతర రాష్ట్రాలకూ ఓ మార్గాన్ని చూపింది. ఫలితంగా దేశం మొత్తం మీద రూ.2500 కోట్ల విలువైన 73 ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను గుర్తించడం జరిగింది. ఇందులో రూ.400 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులను బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే గుర్తించడం విశేషం. ఇంధన సామర్థ్య ఫైనాన్సింగ్ ప్రాజెక్టులను గుర్తించడంలో ఏపీ నంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. ఏపీలో దశల వారీగా చేపట్టే రూ.400 కోట్ల విలువైన ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు బీఈఈ సంపూర్ణ సహకారం అందిస్తుంది’’ అని అభయ్ భాక్రే తెలిపారు.
‘‘ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ సహా అన్ని పెద్ద రాష్ట్రాలకు అభినందనలు తెలియజేస్తున్నా. 2030 కల్లా 150 మిలియన్ టన్నుల ఆయిల్ ఈక్విలెన్ట్ ను ఆదా చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రాలకు అవసరమైన ప్రపంచ శ్రేణి ఇంధన సామర్థ్య సాంకేతికతలను అందించడానికి బీఈఈ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది’’ అని బీఈఈ డీజీ భాక్రే పేర్కొన్నారు. ఏపీలో మూడేళ్ల కిందటే ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఫలితంగా ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఏపీఎస్ఈసీఎం అనేక మైలురాళ్లను చేరుకుందని చెప్పారు. రు.
ఆంధ్రప్రదేశ్ లో వార్షిక ఇంధన డిమాండ్ 65830 మిలియన్ యూనిట్లు కాగా, వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు ద్వారా 26 శాతం (16875 మిలియన్ యూనిట్లు), రూ.11779 కోట్ల విలువైన ఇంధన ఆదా చేయవచ్చని బీఈఈ ప్రాధమికంగా అంచనా వేసింది. మూడు నాలుగేళ్లుగా ఏపీ ఏటా రూ.3914 కోట్ల విలువైన 5608 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేస్తోంది. ఇందులో ఒక్క పాట్ పథకం ద్వారానే 3430 మిలియన్ యూనిట్ల విద్యుత్తును పొదుపు చేస్తోంది. ఏపీలో ఇంకా 11200 మిలియన్ యూనిట్ల ఇంధన పొదుపునకు అవకాశాలు ఉన్నాయి.
ఏపీఎస్ఈసీఎం ప్రత్యేకమైన ఐవోటీ ఆధారిత విద్యుత్తు పర్యవేక్షణ డివైస్ ను 65 ఎంఎస్ఎంఈల్లో ప్రవేశపెట్టగా.. ఇది యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పీఏటీ పథకం ద్వారా భారీ పరిశ్రమల్లో విజయవంతంగా ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తోంది. 1.205 మిలియన్ టన్నుల ఈక్వివలెంట్ ఇంధనాన్ని ఆదా చేయగలిగింది.
బీఈఈ కార్యదర్శి ఆర్.కె.రాయ్ ఏపీఎస్ఈసీఎంను ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఇతర రాష్ట్రాలు, ప్రభుత్వరంగ సంస్థలకు చుక్కానిగా అభివర్ణించారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించడమే గాక క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇంధన పొదుపు కార్యక్రమాల్లో పరిశ్రమలు, రైతులు, ఎన్జీవోలు, స్వయం సహాయ సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తోందని కొనియాడారు.
ఏపీఎస్ఈసీఎం ప్రయత్నాలను, కార్యక్రమాలను గుర్తించి, అభినందించడమే గాక సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తున్న బీఈఈ డైరెక్టర్, కార్యదర్శికి, ఏపీఎస్ఈసిఎం సీఈవో ఎ.చంద్రశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర భాగస్వామ్యపక్షాలందరి సహాయం వల్లే ఏపీఎస్ఈసీఎంకు జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం దక్కాయని చెప్పారు.
అలాగే ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీఎస్ఈసీఎం చైర్మన్ కె.ఎస్.జవహర్ రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీఎస్ఈసీఎం వైఎస్ చైర్మన్ కె.విజయానంద్, ఏపీ ట్రాన్స్ కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలకు కృతజ్ణతలు తెలియజేశారు. 2030 కల్లా రాష్ట్రంలో 6.68 ఎంటీవోఈల ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్ని శాఖలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో ఇంధన సామర్థ్యాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని పేర్కొన్నారు. ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్య కార్యక్రమాల్లో భాగంగా ఉత్తమ విధానాలను అనుసరించడం వల్ల సైతం అందుబాటు ధరకు విద్యుత్తును అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఇంధన సామర్థ్య, సంరక్షణ కార్యక్రమాల వల్ల సాధారణ వినియోగదారులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు లబ్ధి పొందడమేగాక పర్యావరణాన్ని కాపాడవచ్చని సీఈవో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పి.బి. సిద్ధార్థలో ఎం.బి.ఎ. విద్యార్థులకు వర్క్ షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంప్రదాయ జ్ఞాన సముపార్జనతో పాటు సాంకేతిక, విశ్లేషణాత్మక సామర్థ్యాలను కూడా విద్యార్థులు పెంపొందించుకోవాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *