-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 51 లక్షలతో నిర్మించిన నూతన రహదారుల ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడున్నరేళ్లలో నియోజకవర్గంలో 90 శాతం రహదారుల నిర్మాణ పనులు చేపట్టినట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 31 వ డివిజన్ పార్కు రోడ్డులో రూ. 31.13 లక్షలతో నిర్మించిన నూతన రహదారులతో పాటు.. మధురానగర్ ఆర్.యు.బి.కి ఇరువైపులా రూ. 20 లక్షలతో నిర్మించిన సర్వీస్ రోడ్లను వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పెనుమత్స శిరీష సత్యం, కొంగితల లక్ష్మీపతిలతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో నియోజకవర్గానికి చేసింది శూన్యమని.. నగర అభివృద్ధికి కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిధులను సక్రమంగా వినియోగించి.. ప్రజలకు అన్నీ రకాల మౌలిక సదుపాయాలను కలిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యం వేలాది మంది సంచరించే పార్కు రోడ్డును గత ప్రభుత్వం పట్టించుకోలేదని.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రూ. 31.13 లక్షల నిధులతో ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్ట్యా.. రాకపోకలకు అనువుగా ఇరువైపులా రహదారిని పునరుద్ధరించినట్లు వెల్లడించారు. మరోవైపు మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్.యు.బి.) ని గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 18 కోట్ల నిధులను కేటాయించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. 45 శాతం పనులు ఇప్పటికే పూర్తికాగా.. వేసవి ముగిసేనాటికి ఆర్.యు.బి.ని అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు పిల్లి కృష్ణవేణి, పట్టాభి రామరాజు, బెజ్జం రవి, మానం వెంకటేశ్వరరావు, కనపర్తి కొండా, ఎస్.కె.బాబు, అక్బర్, కొండలరావు, చీమల గోవింద్, సముద్రపు గోవింద్, దేవినేని శివాజీ, అంగిరేకుల విజయ్, వీఎంసీ సిబ్బంది, స్థానికులు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News