-పోలింగ్ బందోబస్తుకు 1601 మంది సివిల్ , ఆర్మ్ డ్ పోర్స్ నియామకం : జిల్లా ఎస్.పి.
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అవసరమైన పోలింగ్ సామాగ్రి ఈ నెల 4 నాటికి సిద్ధం చేస్తున్నామని, పి.ఓ., ఎ.పి.ఓ. ల శిక్షణ రెండవ విడత ఈ నెల 9 న నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి వివరించారు. పోలింగ్ బందోబస్తు ఏర్పాట్లకు జిల్లా పోలీసులను 1136, ఆర్మ్ డ్ ఫోర్స్ 465 మంది అవసరముందని ఆ మేరకు కోరడం జరిగిందని జిల్లా ఎస్.పి. పరమేశ్వర్ రెడ్డి వివరించారు.
బుధవారం మద్యాహ్నం అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఎం.ఎల్.సి. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఎన్నికల జరుగుతున్న జిల్లాల కలెక్టర్ లతో, ఎస్.పి. లతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా స్థానిక జిలా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్.పి. , నగరపాలక కమీషనర్ అనుపమా అంజలి, డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్.పి. లు కులశేఖర్, వెంకట రావు, ఆర్.డి.ఓ. లు రామారావు, కనకనరసారెడ్డి హాజరయ్యారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ ఓటర్ స్లిప్స్ ను మార్చి 8 నాటికి పంపిణీ పూర్తి చేసి అదే రోజు సాయంత్రం కల్లా లేదా మరుసటి దినం 9 న ఉదయం ఓటర్ స్లిప్స్ పంపిణీ చేసిన రసీదులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరుగకుండా పకడ్బందీగా అమలు చేయాలని, ఉల్లంఘనలు ఉంటే వాటిపై ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగస్తులు ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన రాదని, ఎన్నికల ప్రచారం కొరకు పార్టీలు ప్రభుత్వ భవనాలు, సంస్థలు, సామాగ్రిని వినియోగించరాదని, అతిక్రమించిన వారి పై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ జిల్లాలో పోలింగ్ నిర్వహణపై వివరిస్తూ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 62 పోలింగ్ కేంద్రాలు అనుబంధంగా 39 అక్సలరీ పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని నేడు ఉదయం పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులకు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ పూర్తి చేశామని ఈ నెల 9 న మరోమారు శిక్షణను ఇవ్వనున్నామని అన్నారు. 138 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పి.ఓ., ఎ.పి.ఓ. ల నియామకం, 20 శాతం అదనంగా సిబ్బంది అందుబాటులో ఉండేలాగా చర్యలు చేపట్టామని తెలిపారు. 78 మంది మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామని, పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటుకు ఏజన్సీ నియామకం జరిగిందని, వీడియో రికార్డింగ్ చేపట్టనున్నామని వివరించారు. పోలింగ్ విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ అందించడానికి వివరాలను సిద్ధం చేశామని తెలిపారు.
జిల్లా ఎస్.పి. వివరిస్తూ పోలింగ్ రోజు బందోబస్తు ఏర్పాట్లకు సివిల్ ఫోర్స్ కు సంబంధించి నలుగురు అడిషనల్ ఎస్.పి.లు, ఎనిమిది మంది డి.ఎస్.పి. లు, 29 మంది సి.ఐ.లు, 62 మంది ఎస్.ఐ.లు, 202 ఎ.ఎస్.ఐ. లు/ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, 692 మంది పోలీసులు, 138 మంది హోం గార్డ్లు నియామక ప్రణాళిక సిద్ధం చేశామని, ఆర్మ్ డ్ ఫోర్స్ 465 మంది అవసరమని కోరడం జరిగిందని వివరించారు. క్రిటికల్, హైపర్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద గత ఎన్నికల అనుభవాలను దృష్టి లో పెట్టుకుని బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టనున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో ఎ.పి.ఐ.ఐ.సి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, పోలీసు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News