-శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే…తప్పక దర్శించుకోవాలనుకుంటారు…
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త :
ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ…
శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. వాయువంతటి గొప్పక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు. దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి. అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది. అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది. అదే శ్రీకాళహస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదు. ఇక్కడ ఆలయ శిఖరం దర్శనం చేసుకుంటే కైలాసం చూసినట్లే. భక్తుడికి అగ్రతాంబులం వేసిన క్షేత్రం కూడా ఇదే. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని ముఖ్య భక్తుడైన భక్తకన్నప్పకు మొదటి పూజ చేస్తారు. దేశంలోనే అన్ని ఆలయాల్లో భక్తులు సవ్యదిశలో ప్రదక్షిణం చేసి స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు.
శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని, జ్ఞానప్రసూనాంబను దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఇక్కడ రాహు-కేతువులు శాంతిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖాన స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి… మొదట పాతాళ వినాయకస్వామిని దర్శించుకున్నాకశ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది. నక్కీరుడు అనే భక్తుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ చరమాంకంలో శివుని దర్శించుకుని మోక్షం పొందాలని భావించాడు. కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి శివుని దర్శించుకున్నాక శిఖరదర్శనం చేసుకోవాలని అదృశ్యశక్తి ఉపదేశం చేసింది. అలా దర్శనం చేసుకోవడంతో నక్కీరుని కుష్ఠువ్యాధి నయమైంది. పాతాళ గణపతి ఆలయం వద్ద నాలుగు పర్యాయాలు విఘ్నేశ్వరస్వామిని తలచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది.
శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వ రుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. ఇలా ధరించడంతో గ్రహాలన్నింటినీ శివుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శ్రీకాళహస్తిలో కొలువైఉన్న జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి తల ఓ వైపువాల్చి ఉంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు. మృత్యువును జయించిన గురుదక్షిణామూర్తి కూడా ఈ క్షేత్రంలో దక్షిణాది ముఖాన ఉన్నాడు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఒక క్షణం కళ్లు మూసుకుని ఆయనను స్మరించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. చిన్నారులకు గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది. ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాళహస్తి క్షేత్రం పరమశివుని ఆవాసం. ఈ క్షేత్రంలో ఉండటం ఎంతో అదృష్టం. శ్రీకాళహస్తిలో అడుగు పెడితే పుణ్యం లభించినట్లే.