
-‘ఆజాదీ క అమృత్ కాల్’ సందర్భంగా దేశ అభివృద్ధికి తోడ్పాటుకై కేంద్ర ప్రభుత్వం యువతకు ప్రాధాన్యం కల్పిస్తోంది.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ జనాభాలో 50 శాతం కన్నా అధికంగా ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యానికి ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించారని… అందులో భాగంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేలాల ద్వారా ఇప్పటికి దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఉపాధి పొందారని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరద్ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన 6వ విడత రోజ్గార్ మేలాను ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా మొత్తం 10 లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రధాని దీనిని ప్రారంభించారని అన్నారు. 6వ విడత రోజ్గార్ మేలాలో భాగంగా మొత్తం 43 ప్రాంతాలలో 70 వేల మందికి వివిధ ప్రభుత్వ విభాగాల లో ఉపాధి నియామక పత్రాలను అందజేస్తున్నామని.. ప్రధాని మోడీ డిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ నియామక పత్రాలను అందజేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, రైల్వే, కపవద సిపిడబ్ల్యుడి, తపాలా శాఖ, ఐఐటి సహా తదితర శాఖలలో నియామక పత్రాలను ఇవ్వడం జరిగిందన్నారు. విజయవాడ లో 117 మందికి మంత్రి నియామక పత్రాలను అందజేశారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానున్న ‘ఆజాదీ క అమృత్ కాల్’ సందర్భంగా దేశ అభివృద్ధికి తోడ్పడటంలో ప్రభుత్వం యువతకు ప్రాధాన్యం కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2014 లో దేశ ఆర్ధిక వ్యవస్థ 10వ స్థానంలో ఉండగా, గడచిన 9 ఏళ్లలో సాధించిన ప్రగతి కారణంగా 5వ స్థానానికి చేరుకున్నామని అన్నారు. దేశ బడ్జెట్ వ్యయం 16 లక్షల కోట్ల రూపాయల నుంచి దాదాపు మూడు రెట్లు అంటే 45 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్క భారత దేశంలోనే 40 శాతం మేర డిజిటైజేషన్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ హయాంలో జరుగుతోందని మంత్రి భగవత్ కరద్ వివరించారు.
కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రైల్వే, పోస్టల్, బిఎస్ఎఫ్ ఇతర అధికారులు, సిబ్బంధి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News